పేదల వైద్యానికి సీఎం నిధి భరోసా.. ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
కొడకండ్ల, పాలకుర్తి మండలాల్లో 59 మంది లబ్ధిదారులకు రూ.33.22 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 12 (ప్రజావాణి):పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల, పాలకుర్తి మండలాలకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సిఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన ఆర్థిక సహాయాన్ని పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి గురువారం అందజేశారు.
కొడకండ్ల మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 16 మంది లబ్ధిదారులకు రూ.8,67,000 విలువైన చెక్కులు, పాలకుర్తి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 43 మంది లబ్ధిదారులకు రూ.24,55,000 విలువైన చెక్కులు కలిపి మొత్తం 59 మంది లబ్ధిదారులకు రూ.33,22,000 విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ, అనారోగ్య సమస్యలు ఏ కుటుంబానికైనా అనుకోని ఆర్థిక భారాన్ని మిగులుస్తాయని, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు వైద్య ఖర్చులను భరించలేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. అలాంటి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక చేయూత అందించడం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అర్హులైన బాధితులకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్కరూ మెరుగైన వైద్య చికిత్సకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని అన్నారు. ప్రజల ఆరోగ్యం, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అవసరమైన వారికి ప్రభుత్వ పరంగా సహాయ సహకారాలు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు.
పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి కష్టసుఖాల్లో తోడుగా ఉంటానని, ప్రజా సమస్యల పరిష్కారానికి, అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తానని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భరోసా ఇచ్చారు.
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందుకున్న లబ్ధిదారులు ఎమ్మెల్యే కి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.


