*అక్రమ బెల్ట్ షాపులపై పోలీసుల ఉక్కుపాదం*
*101.5 లీటర్ల మద్యం స్వాధీనం*
*బెల్ట్ షాపులు నిర్వహిస్తే చట్టరీత్యా చర్యలు… మందమర్రి సీఐ రమేష్*
* *మన ప్రజావాణి* *మందమర్రి:-*
పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ పర్సా రమేష్ పర్యవేక్షణలో పట్టణ ఎస్ఐ గోపతి నరేష్, పోలీస్ సిబ్బంది పట్టణంలో బెల్ట్ షాపులపై శుక్రవారం మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం విక్రయిస్తున్న 4 బెల్ట్ షాపులను గుర్తించి, సుమారు 71,000 రూపాయల విలువైన 101.5 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ మందమర్రి సర్కిల్ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలను, బెల్ట్ షాపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించమని స్పష్టం చేశారు. బెల్ట్ షాపుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని, పేద కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయని తెలిపారు. బెల్ట్ షాప్ వివాహకులు స్వచ్ఛందంగా వాటిని మూసివేయాలని సూచించారు. పదేపదే అక్రమ మద్యం విక్రయిస్తూ పట్టుబడితే కేసులతో పాటు బైండోవర్ సైతం చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ విక్రయాల సమాచారం తెలిస్తే ప్రజలు పోలీసులకు తెలియజేయాలి, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈకార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


