📄 ePaper
Epaper 2
Friday, November 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణటీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న కాన్వాయ్ నీ లారీ ఢీ...ప్రమాదమా? పన్నాగమా?

టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న కాన్వాయ్ నీ లారీ ఢీ…ప్రమాదమా? పన్నాగమా?

📰 Generate e-Paper Clip

టీఆర్పీ అధినేత తీన్మార్ మల్లన్న కాన్వాయ్ నీ లారీ ఢీ…ప్రమాదమా? పన్నాగమా?

తీన్మార్ మల్లన్న హత్యకు కుట్ర జరిగిందా?

ప్రజావాణి నవంబర్ 13 బీసీ రాజ్యాధికార యాత్రను అడ్డుకునేందుకు పన్నాగం.. మల్లన్న వర్గం తీవ్ర ఆరోపణలు

లారీ ఢీకొన్న ఘటనలో యువతి మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం

డీజీపీని కలవనున్న ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర సందర్భంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురం సమీపంలో మల్లన్న కాన్వాయ్‌ను వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టడంతో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మేడబోయిన చందన (23) అనే యువతి మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా తీన్మార్ మల్లన్న కాన్వాయ్ వెళ్తుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ ఒక కారును ఢీకొట్టింది. దీంతో ఆ కారు అదుపుతప్పి మరో వాహనాన్ని ఢీకొంది. ప్రమాద తీవ్రతకు మల్లన్నకు చెందిన ఫార్చునర్ కారు నుజ్జునుజ్జయింది. అయితే ప్రమాద సమయంలో మల్లన్న కారులో లేకుండా కాలినడకన యాత్ర కొనసాగిస్తుండటంతో ఆయనకు పెను ప్రమాదం తప్పింది.

ఈ ప్రమాదంలో మేడబోయిన చందన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందగా, ఆమె భర్త సాయినాథ్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. దంపతుల కుమారుడితో పాటు డ్రైవర్‌కు కూడా తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

హత్యకు కుట్ర జరిగిందంటూ ఆరోపణలు..

ఈ ప్రమాదం యాదృచ్ఛికంగా జరిగిందా? లేక బీసీ రాజ్యాధికార యాత్రను అడ్డుకునేందుకు పన్నిన కుట్రలో భాగమా? అనే అనుమానాలను మల్లన్న వర్గం వ్యక్తం చేస్తోంది. బీసీలను చైతన్యపరుస్తూ రాజ్యాధికార లక్ష్యంతో ముందుకు సాగుతున్న తీన్మార్ మల్లన్నను లక్ష్యంగా చేసుకుని లారీతో కారును ఢీకొట్టించారని, యాత్రను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాలనే ఉద్దేశంతో ఈ దాడికి కుట్ర పన్నారని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు.

గతంలో బీసీ ఉద్యమంలో చురుకుగా పనిచేసిన బెల్లి లలిత, మారోజు వీరన్న, సాంబశివుడు వంటి వారి హత్యలను ప్రస్తావిస్తూ, బీసీల హక్కులు, రాజ్యాధికారం కోసం పోరాడుతున్న నాయకులకు ప్రాణహాని ఉందని మల్లన్న వర్గం ఆందోళన వ్యక్తం చేస్తోంది. యాత్రను కొనసాగిస్తే ప్రాణాలకు ముప్పు తప్పదనే హెచ్చరికలు వస్తున్నాయని కూడా ఆరోపిస్తోంది.

డీజీపీని కలవనున్న మల్లన్న..

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రమాదం వెనుక ఏదైనా కుట్ర ఉంటే దానిని వెలికితీసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీని కలవనున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన అన్ని కోణాల్లో పోలీసుల దర్యాప్తు కీలకంగా మారింది.

ఒకవైపు యువతి మృతి, మరోవైపు పలువురి ప్రాణాపాయ పరిస్థితి, ఇంకోవైపు హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పోలీసుల విచారణలో ప్రమాదానికి సంబంధించిన అసలు వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.