నంగునూరు, నవంబర్ 11:భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, గొప్ప విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ విద్యా దినోత్సవాన్ని నంగునూరు మండలం నర్మెట్ట ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. మౌలానా అబుల్ కలాం ఆజాద్ భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా దేశ విద్యారంగ అభివృద్ధికి విశేష కృషి చేశారని కొనియాడారు. 1888 నవంబర్ 11న సౌదీ అరేబియాలోని మక్కాలో జన్మించిన ఆయన, అనంతరం భారతదేశానికి వచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారని వివరించారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించి, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేశారని తెలిపారు. బ్రిటిష్ పాలకుల నిర్బంధాన్ని ఎదుర్కొంటూ పలుమార్లు జైలు జీవితాన్ని కూడా అనుభవించారని గుర్తుచేశారు.స్వాతంత్ర్యం అనంతరం దేశ తొలి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆజాద్, విద్య అనేది ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కుగా భావించి, పేద, బడుగు, బలహీన వర్గాలకు నాణ్యమైన విద్య అందించేందుకు విశేషంగా కృషి చేశారని పేర్కొన్నారు. దేశంలో ప్రాథమిక విద్యను బలోపేతం చేయడం, ఉన్నత విద్యకు ప్రోత్సాహం కల్పించడం, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధికి పునాదులు వేయడంలో ఆయన సేవలు చిరస్మరణీయమని అన్నారు.విద్య ద్వారానే సమాజంలో సమానత్వం, అభివృద్ధి, చైతన్యం సాధ్యమవుతాయని నమ్మిన మహనీయుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, ఆయన ఆశయాలను నేటి విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. ప్రతి ఒక్కరూ విద్యావంతులై దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎనగందుల మనీష్ కుమార్, ఉపాధ్యాయులు తహసీల్ సుల్తానా, ఎం.డి. హర్షద్, సునీత, లలిత, కవిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు జాతీయ విద్యా దినోత్సవ ప్రాధాన్యతను తెలుసుకొని, మహనీయుల జీవితాల నుంచి స్ఫూర్తి పొందారు.

