📄 ePaper
Epaper 2
Friday, November 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ ఈటల రాజేందర్

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ ఈటల రాజేందర్

📰 Generate e-Paper Clip

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే: ఎంపీ ఈటల రాజేందర్

ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ భాజపా

కార్యకర్తలు, ఓటర్లే నిజమైన వీఐపీలని వ్యాఖ్య

మేడ్చల్, నవంబర్ 5: తెలంగాణలో ప్రజల పక్షాన నిలబడి ప్రతి సమస్యపై అలుపెరగకుండా పోరాడుతున్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జవహర్‌నగర్ పాదయాత్రను దిగ్విజయం చేయడంతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతగా గురువారం ఈటల రాజేందర్ ఆధ్వర్యంలో కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈటల రాజేందర్ నివాస సమీపంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి మల్కాజ్‌గిరి పార్లమెంట్ పరిధిలోని మేడ్చల్, అర్బన్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన ఈటల రాజేందర్, జవహర్‌నగర్ పాదయాత్రను, అమిత్ షా సభను తమ భుజస్కంధాలపై వేసుకుని విజయవంతం చేసిన ప్రతి కార్యకర్తకు, నాయకుడికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యకర్తల కష్టం, నిబద్ధతే పార్టీకి కొండంత బలమని పేర్కొంటూ, భవిష్యత్ కార్యాచరణపై వారికి దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో ప్రజల సమస్యలపై తక్షణమే స్పందిస్తూ నిరంతరం పోరాటం చేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎమ్మెల్యేల నాయకత్వంలో ఇందిరా పార్క్ వద్ద 48 గంటల పాటు ధర్నా నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పేదల ఇళ్లు, గుడిసెల కూల్చివేతలను అడ్డుకునేందుకు బీజేపీ నాయకులు బస్తీల్లోనే 24 గంటలు ఉండి బాధితులకు అండగా నిలిచారని తెలిపారు. దుండిగల్, బౌరంపేట వంటి ప్రాంతాల్లో పేదల అసైన్డ్ భూముల రక్షణ కోసం అధికారులను నిలదీసి వారికి అండగా నిలిచామని, విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యపై కూడా నిరంతరం పోరాడుతున్నామని పేర్కొన్నారు. పార్టీలో నిజమైన వీఐపీలు ఇద్దరేనని, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే నాయకులు, కార్యకర్తలు ఒకరైతే, పార్టీని ఆశీర్వదించే ఓటర్లు, ప్రజలు మరొకరని ఈటల రాజేందర్ అన్నారు. కష్టకాలంలో కాషాయ జెండాను మోసిన కార్యకర్తలను ఎప్పటికీ విస్మరించబోమని స్పష్టం చేశారు. గ్రామస్థాయి నాయకుడికి ఎంత గౌరవం ఉంటుందో, ఉన్నతస్థాయి నాయకుడికీ అంతే గౌరవం దక్కాలని పేర్కొన్నారు. ముఖంపై చిరునవ్వు, ప్రేమ, ఆత్మీయ పలకరింపు, కలుపుగోలుతనం ఉన్నవారే మంచి నాయకులుగా ఎదుగుతారని సూచించారు. ఇటీవల పలు ప్రాంతాల్లో నిర్వహించిన పాదయాత్రల్లో పార్టీ బలంగా ఉన్న చోట ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి హారతులు పట్టి ఆశీర్వదించారని తెలిపారు. కింది స్థాయిలో పార్టీ నాయకత్వం బలంగా లేకుండా ఇతర పార్టీలపై ఆధారపడి ఓట్లు సాధించగలమని భావించడం భ్రమ మాత్రమేనని అన్నారు. కార్యకర్తల ఐక్యత, శ్రమ, పట్టుదలే అంతిమంగా విజయాన్ని అందిస్తాయని స్పష్టం చేశారు. నాలుగు జిల్లాల పరిధిలో ఉన్న మల్కాజ్‌గిరి పార్లమెంట్ నాయకులు, కార్యకర్తలందరూ ఎలాంటి భేదాభిప్రాయాలకు తావులేకుండా అన్నదమ్ముల్లా, ఒకే కుటుంబ సభ్యుల్లా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అంతర్గత సమస్యలు ఉంటే కుటుంబ సభ్యుల్లా లోపలే చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రజల అంచనాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేస్తే రాబోయే రోజుల్లో అద్భుతమైన విజయాలు సాధించవచ్చని కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు. ఆత్మీయ సమ్మేళనానికి వచ్చిన ప్రతి ఒక్కరూ కలిసి భోజనం చేసి, ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకుని తేనెటీగల్లా ఐక్యంగా ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్, మాజీ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, ఎమ్మెల్సీ జనార్దన్ రెడ్డి, మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షురాలు జల్లి శైలజ హరినాథ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహన్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు జగన్ గౌడ్, జిల్లా కోశాధికారి లవంగ శ్రీకాంత్, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు సంధ్య రెడ్డి, జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు రాగం అర్జున్, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాజు రెడ్డి, విక్రమ్ రెడ్డి, బుద్ది శ్రీను, వేణుగోపాల్ రెడ్డి, మల్లికార్జున్, కృష్ణ గౌడ్, నర్సింహా రెడ్డి, బొజ్జ రాఘవ రెడ్డి, మహేష్ గౌలికర్, సత్యనారాయణ రెడ్డి, బచ్చు కృష్ణ ప్రియ, అనిత జంగం, గోనె శ్రీనివాస్, లక్ష్మి వేణుగోపాల్, అర్జున్, రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.