ఉద్యమకారులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి–
లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకోవాలి – మ్యాకల శ్రీకాంత్ యాదవ్
బెజ్జంకి, నవంబర్ 5 (ప్రజావాణి)
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం (TUF) బెజ్జంకి మండల అధ్యక్షుడు మ్యాకల శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు. ఇటీవల ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని, ఆయన కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు.
అర్హులైన ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, నెలవారీ గౌరవ పెన్షన్లు అందించాలని, వారి కుటుంబాలకు విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల ఫోరం నాయకులను ముందస్తుగా అరెస్టు చేయడాన్ని ఖండించారు. అరెస్టులతో ఉద్యమకారుల గొంతును నొక్కలేరని, వారి సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేసి, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మ్యాకల శ్రీకాంత్ యాదవ్ డిమాండ్ చేశారు.

