ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలి…
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు డిమాండ్
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, నవంబర్ 03 (ప్రజావాణి): జిల్లా లోని చిల్పూర్ మండల కేంద్రంలో గుట్ట కింద సీపీఎం పార్టీ మండల కమిటీ సమావేశం పోలు సంపత్ అధ్యక్షతన మంగళవారం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండలంలోని రెవెన్యూ, ఎంపీడీఓ, ఉపాధి హామీ తదితర ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఇచ్చిన వినతిపత్రాలు, దరఖాస్తులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు నిత్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ పడిగాపులు కాయాల్సి వస్తోందని, వెంటనే వీటిని పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
మండలంలో సొంత ప్రభుత్వ భవనాల నిర్మాణాలు చేపట్టకుండా పాలకులు, అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు.
ఎల్ నినో ప్రభావం వల్ల లింగంపల్లి, కొండాపూర్, శ్రీపతిపల్లి గ్రామాల్లో రైతుల పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయారని, ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ మూడు గ్రామాలను ‘కరువు గ్రామాలుగా’ ప్రకటించి నష్టపోయిన రైతులను, ఉపాధి కోల్పోయిన కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మండలంలో ఐకేపీ & పాక్స్ సెంటర్లలో రైతులు పండించిన వడ్లు మిగిలిపోయి ఉన్నా పట్టించుకున్న నాథుడే లేడని విమర్శించారు.
రానున్న రోజుల్లో ప్రజల సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఈ సమావేశంలో మండల కార్యదర్శి సాదం రమేష్, నాయకులు బర్మా రవి తదితరులు పాల్గొన్నారు.

