*మహిళల రక్షణలో సమర్థవంతంగా పనిచేస్తున్న నల్లగొండ షీ టీమ్స్*
*మహిళలు మౌనం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి – జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్* ..
*నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి*
మహిళలు, బాలికలు, చిన్నారులు, విద్యార్థినుల భద్రతకు నల్లగొండ జిల్లా పోలీస్ శాఖ ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ తెలిపారు. ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపులు, అసభ్య ప్రవర్తన వంటి ఘటనలను అరికట్టేందుకు షీ టీమ్స్ నిరంతరం పనిచేస్తూ బాధిత మహిళలకు అండగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
నల్లగొండ, మిర్యాలగూడ కేంద్రాలుగా రెండు షీ టీమ్స్ బృందాలు పనిచేస్తున్నాయి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్ మాల్స్ తదితర జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిరంతరం నిఘా ఏర్పాటు చేసి వేధింపులకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాయి. మహిళలు ఎలాంటి భయం లేకుండా తమ సమస్యలను తెలియజేసేందుకు షీ టీమ్స్ భరోసా కల్పిస్తున్నాయి. ఫిర్యాదు చేయడానికి మహిళలు నేరుగా పోలీస్ స్టేషన్లకు రావాల్సిన అవసరం లేకుండా డయల్ 112, పోలీస్ శాఖ అందించిన క్యూ.ఆర్ కోడ్, వాట్సాప్ తదితర మార్గాల ద్వారా ఫిర్యాదు చేసే సౌకర్యం కల్పించామని ఎస్పీ తెలిపారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, మైనర్ బాలికలు, మహిళలపై లైంగిక వేధింపులు జరిగినప్పుడు భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమస్యను ప్రారంభంలోనే తెలియజేస్తే బాధితులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవచ్చని, మౌనంగా ఉండటం వల్ల వేధింపులు మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలిపారు. ఒక్క ఫోన్ కాల్ ద్వారా పోలీసుల సహాయం పొందవచ్చని భరోసా ఇచ్చారు.
సోషల్ మీడియా వినియోగంలో మహిళలు, యువతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయాలు పెంచుకొని ఫోటోలు సేకరించడం, వాటిని మార్ఫింగ్ చేసి బ్లాక్‌మెయిల్ చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయని హెచ్చరించారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని, వ్యక్తిగత ఫోటోలు, వివరాలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని, ఖాతాల్లో ప్రైవసీ సెట్టింగ్స్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనుమానాస్పద ఫోన్ కాల్స్, లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
మహిళలు బయటకు వెళ్లే సమయంలో తెలంగాణ పోలీస్ శాఖ అందుబాటులోకి తెచ్చిన T-Safe యాప్ను డౌన్‌లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని, ప్రయాణ సమయంలో భద్రతా సేవలను ఉపయోగించుకోవాలని ఎస్పీ సూచించారు.
*అక్టోబర్ నెలలో షీ టీమ్స్ పనితీరు* :
అక్టోబర్ నెలలో షీ టీమ్స్‌కు 14 ఫిర్యాదులు అందగా, వాటిలో 3 పెట్టీ కేసులు నమోదు చేశారు. మహిళల భద్రతపై 57 అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. 49 మందికి కౌన్సెలింగ్ ఇచ్చారు. వేధింపులకు పాల్పడుతున్న 38 మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. హాట్‌స్పాట్ ప్రాంతాలను 492 సార్లు సందర్శించి నిఘా కొనసాగించారు.
*ఫిర్యాదుల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు:*
జిల్లా షీ టీమ్: 8712670235
జిల్లా షీ టీమ్ ఇన్‌చార్జి కె. మంజుల, ఇన్‌స్పెక్టర్: 8712670143
నల్లగొండ షీ టీమ్ ఇన్‌చార్జి గౌస్, ఎస్‌ఐ: 8712576870
మిర్యాలగూడ షీ టీమ్ ఇన్‌చార్జి ఎస్. వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ: 8712582094.
మహిళల భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. మహిళలు ఎలాంటి భయం, సంకోచం లేకుండా వేధింపులపై ఫిర్యాదు చేయాలని, వారి రక్షణకు జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

