రైతుల అప్రమత్తతతో కాపర్ వైర్ల దొంగలు అరెస్ట్!
చెల్లెపాడు లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద అర్ధరాత్రి చోరీ.. నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించిన రైతులు
మూడు నెలల క్రితమే చిన్నమారు ఫేజ్-2లో చోరీ.. మళ్లీ ఘటనతో రైతుల్లో ఆందోళన
చిన్నంబావి, నవంబర్ 2 ప్రజావాణి:
చిన్నంబావి మండలం చెల్లెపాడు ఎత్తిపోతల పథకం వద్ద కాపర్ వైర్ల చోరీకిపాల్పడుతున్ననిందితులను రైతులుఅప్రమత్తతతో పట్టుకుని పోలీసులకు అప్పగించారు. రాత్రివేళ పంటలకు నీరు పారిస్తున్న సమయంలో అనుమానాస్పద శబ్దాలువినిపించడంతో రైతులు పరిశీలించగా చోరీ విషయం వెలుగులోకి వచ్చింది.చెల్లెపాడు గ్రామానికి చెందిన రైతులు రాత్రి వేళ పంట పొలాలకు నీరు పెడుతుండగా, లిఫ్ట్ ఇరిగేషన్ సమీపంలో ఇనుప వస్తువుల శబ్దం వినిపించింది. దీంతో అనుమానం వచ్చిన రైతులు అక్కడికి వెళ్లి చూడగా, కొందరు వ్యక్తులు కాపర్ వైర్లు చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో ఒక నిందితుడు బైక్పై పారిపోయేందుకు ప్రయత్నించగా, మరొకరుతప్పించుకునేందుకు యత్నించారు. రైతులు వెంటనే స్థానిక ఎస్సైకు సమాచారం అందించి, వెల్టూరు–చిన్నమారు రహదారి సమీపంలో నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితులు జటప్రోల్ గ్రామానికి చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. చోరీకి గురైన కాపర్ వైర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వరుస చోరీలతో రైతుల్లో ఆందోళన
మూడు నెలల క్రితం చిన్నమారు ఎత్తిపోతల పథకం ఫేజ్-2 వద్ద కూడా కాపర్ వైర్లు చోరీకి గురయ్యాయి. ఆ ఘటనమరువకముందే చెల్లెపాడు ఎత్తిపోతల పథకం వద్ద మరో చోరీ వెలుగులోకి రావడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతల పథకాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద నిఘా పెంచి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరుతున్నారు.
ఈ ఘటనపై అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాషువా స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. రైతులకుఇబ్బందులు కలిగించే విధంగా చోరీలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

