ఖో-ఖో పోటీల్లో ఆందోల్ జట్టుకు ద్వితీయ స్థానం
• జోగిపేట విద్యార్థినుల ప్రతిభకు పాఠశాల యాజమాన్యం అభినందనలు
మన ప్రజావాణి | జోగిపేట | నవంబర్ 03| జిల్లా ప్రతినిధి
70వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ( ఎస్ జి ఎఫ్) సంగారెడ్డి జిల్లా మండల స్థాయి టోర్నమెంట్‌లో భాగంగా అక్టోబర్ 30, 31 తేదీల్లో సంగారెడ్డిలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన ఖో-ఖో పోటీల్లో అండర్-17 బాలికల విభాగంలో ఆందోల్ జట్టు ద్వితీయ స్థానం సాధించింది.
ఈ పోటీల్లో సెయింట్ డాన్ బాస్కో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, జోగిపేటకు చెందిన బి. మానస్విని (9వ తరగతి), జి. స్వాతిక (8వ తరగతి), పి. ప్రణతి (8వ తరగతి) ప్రతిభ కనబరిచి ఆందోల్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా పాఠశాల అడ్మినిస్ట్రేటర్
రెవ. ఫాదర్ ఎన్. సురేష్ విద్యార్థినులకు పుష్పగుచ్ఛాలు అందించి అభినందించారు. పాఠశాల కరస్పాండెంట్ రెవ. ఫాదర్ సిబి సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఫాదర్ ఎన్. సురేష్ మాట్లాడుతూ, క్రీడలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, ఐకమత్యం, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు. ఖో-ఖో పోటీల్లో ద్వితీయ స్థానం సాధించడం అభినందనీయమని, ఈ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థినులను ప్రోత్సహించారు.
విద్యార్థినుల విజయానికి సహకరించిన తల్లిదండ్రులను కూడా ఆయన ప్రత్యేకంగా అభినందించారు. పిల్లలను క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ, వారికి అవసరమైన సహకారం అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో తల్లిదండ్రుల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
విద్యార్థినులు సాధించిన విజయంపై పాఠశాల కరస్పాండెంట్ రెవ. ఫాదర్ సిబి, అడ్మినిస్ట్రేటర్ రెవ. ఫాదర్ ఎన్. సురేష్ హర్షం వ్యక్తం చేశారు. విద్యతో పాటు క్రీడలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి పాఠశాల యాజమాన్యం కృషి చేస్తోందని తెలిపారు.

