పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతుకను అణచివేస్తున్న బీజేపీ
ప్రజాస్వామ్య హక్కుల కోసం మా పోరాటం ఆగదు.. నియంతృత్వాన్ని సహించేది లేదు:
ఎంపీ గడ్డం వంశీకృష్ణ
ప్రజావాణి జిల్లా ప్రతినిధి
పెద్దపల్లి అక్టోబర్ 31
న్యూఢిల్లీ: పార్లమెంట్లో ప్రతిపక్షాల గొంతుకను అణచివేస్తూ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజా సమస్యలను లేవనెత్తిన ప్రతిసారీ మైక్ కట్ చేయడం నియంతృత్వ ధోరణికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు మైక్ కట్ చేయడం, ప్రజా సమస్యలను ప్రస్తావించినప్పుడు గొంతుకను నొక్కేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎంపీ పేర్కొన్నారు. స్పీకర్ దేశంలోని ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతినిధిగా కాకుండా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. పార్లమెంట్ ప్రజల సమస్యలను చర్చించే వేదికగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని అణచివేసే వేదికగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత నెల రోజులుగా విద్యార్థులపై దాడులు చేస్తూ, వారిని ఉగ్రవాదులుగా చిత్రీకరించడం దారుణమని ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులపై దాడులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
దేశ ప్రజల గొంతుకను పార్లమెంట్లో వినిపించడం ప్రతిపక్షాల బాధ్యత అని స్పష్టం చేశారు. ప్రజల సమస్యలను ప్రస్తావించకుండా అడ్డుకోవడం, ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడం సహించేది లేదని హెచ్చరించారు.
ప్రజల గొంతుకను అణచివేయాలని చూస్తే మౌనంగా ఉండబోమని, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఎంపీ గడ్డం వంశీకృష్ణ స్పష్టం చేశారు.

