మేడ్చల్ వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి
ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డికి వినతిపత్రం అందజేసిన మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ ముదిరాజ్
మేడ్చల్, అక్టోబర్ 23 (ప్రజావాణి): మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతం నుంచి వెలువడుతున్న వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ కౌన్సిలర్ ఉమా నాగరాజ్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు శుక్రవారం బోయిన్‌పల్లిలోని ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి నివాసానికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దసరా పండుగను పురస్కరించుకొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం, మేడ్చల్ ప్రజలు ఎదుర్కొంటున్న వాయు కాలుష్య సమస్యపై వినతిపత్రం అందజేశారు.
మేడ్చల్ పారిశ్రామిక ప్రాంతం నుంచి వెలువడుతున్న కాలుష్య వాయువులపై స్థానిక ప్రజల్లో ఆందోళన నెలకొందని ఆమె ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. పరిశ్రమల నుంచి వెలువడే ఉద్గారాల ప్రభావంపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టి, కాలుష్య తీవ్రతను అంచనా వేయాలని కోరారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా కాలుష్య నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

