కోటగిరిలో వైభవంగా దేవి శరన్నవరాత్రి వెండి పండుగ.
మూడు రోజుల పాటుగా కన్నులపండువగా శతచండీ మహాయాగం.
బుధవారం అమ్మవారి మహా శోభాయాత్రకు పెద్దఎత్తున ఏర్పాట్లు.
25 ఏళ్ల వేడుకల్లో భాగంగా కోలాహలంగా సాంస్కృతిక ప్రదర్శనలు,శతచండి మహాయాగం,అన్నదానాలు, ఆర్కెస్ట్రా.





కోటగిరి/ప్రజావాణి:-శ్రీ సార్వజనిక్ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కోటగిరిలోని శ్రీ విఠలేశ్వర మందిరంలో దేవి శరన్నవరాత్రి 25 ఏళ్ల రజతోత్సవ (సిల్వర్ జూబ్లీ) వేడు కలు అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక వాతావరణంలో సాగుతున్నాయి.ఈ వేడుకల సందర్భంగా గ్రామంలోని ప్రధాన వీధులు,ఆలయాలను రంగురంగుల విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రధాన కూడలిలో ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం భక్తులకు చేరేలా సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయడంతో కోటగిరి గ్రామం మొత్తం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లుతోంది. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు రోజుకో అవతారంలో భక్తులకు దర్శన మిచ్చారు.నిత్యం 20 మంది దీక్షాపరులచే ఉదయం ప్రత్యేక పూజలు,హారతి కార్యక్రమాలు నిర్వహించారు.200 మంది సివిల్ స్వాములు అమ్మవారి సన్నిధిలో సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.భక్తుల కోసం రోజూ మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3:00 గం.ల నుండి 4:00 వరకు శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం,సాయంత్రం 6:00 గం.ల నుండి 8:00 గం.ల వరకు దంపతులచే అమ్మవారి కుంకుమార్చన,రాత్రి 8:00గం.ల నుండి 8:45 గం.ల వరకు చిన్నారుల సాంస్కృతిక కార్యక్ర మాలు,కోలాటాలు,రాత్రి 8:45 గం.ల నుండి 9:30 గం.ల వరకు ముఖ్య అతిథుల ఆధ్యాత్మిక ప్రవచనాలు,రాత్రి 9:30 గం.లకు భక్తులకు ప్రసాద వితరణ కన్నులపండువగా కొనసాగింది.ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శతచండీ మహా యాగం 3 రోజుల పాటుగా శాస్త్రోక్తంగా జరిగింది.ఈ యాగంలో భాగంగా సంధ్యారాణి విజయ్ మహారాజ్,రాజు మహారాజ్ ఆధ్వర్యంలో వేద పండితులు అనంత జోషి,కృష్ణ మహరాజ్ల పర్యవేక్షణలో శతచండీ మహాయాగం వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా సాగింది.ఆదివారం నాడు ఈ యజ్ఞంలో భాగంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమం భక్తుల కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ. బుధవారం ఉదయం 10:00 గంటలకు అమ్మవారి శోభాయాత్ర అత్యంత వైభవంగా ప్రారంభమవుతుందని తెలిపారు.రాత్రి 8:00 గంటలకు ఈ యాత్ర కోటగిరిలోని అంగడి బజార్ వద్దకు చేరుకుంటుంది.ఈ సందర్భంగా సార్వజనిక్ దేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ కోటగిరి ఆధ్వర్యంలో భారీ ఆర్కెస్ట్రా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.అనంతరం దామరచెరువు వద్ద అమ్మవారి నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు.శ్రీ సార్వజనిక్ దేవి శరన్నవరాత్రి రజతోత్సవ వేడుకలను విజయవంతం చేయడానికి సహకరించిన దాతలకు, భక్తులకు ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.అమ్మవారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని వారు ఆకాంక్షించారు.

