*బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్
*పలు వార్డుల్లో ఏర్పాట్లను పరిశీలించిన ఎల్లంపేట్ మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్*
మేడ్చల్: ప్రజావాణి:- తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకునేలా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలని ఎల్లంపేట్ మున్సిపల్ చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ సంబంధిత అధికారులకు సూచించారు. పండుగ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ఎల్లంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని రావల్‌కోల్, రాజబొల్లారం ప్రాంతాల్లో బతుకమ్మ పండుగ నిర్వహణకు చేపట్టిన ఏర్పాట్లను చైర్‌పర్సన్ లావుడ్యా శ్రీదేవి రమేష్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించే ప్రదేశాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర అంశాలను పరిశీలించి, ప్రజలకు అవసరమైన సౌకర్యాల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు. బతుకమ్మ పండుగలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశం ఉన్నందున వేడుకలు జరిగే ప్రాంగణాలను ముందుగానే శుభ్రం చేయించాలని, పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోకుండా పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. పండుగ ప్రాంగణాల్లో తగినంత వెలుతురు ఉండేలా విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సదుపాయాన్ని అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రజలు, మహిళలు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ప్రేమకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని చైర్‌పర్సన్ పేర్కొన్నారు. తరతరాలుగా వస్తున్న ఈ పండుగను ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో, సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రజల సౌకర్యమే లక్ష్యంగా ఎల్లంపేట్ మున్సిపాలిటీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని తెలిపారు.
పండుగ సమయంలో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. బతుకమ్మ వేడుకలు ప్రశాంతంగా, సజావుగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత మున్సిపల్ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


