📄 ePaper
Epaper 2
Saturday, October 17, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపోత్కపల్లిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్

పోత్కపల్లిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్

📰 Generate e-Paper Clip

పోత్కపల్లిలో గంజాయి కలకలం.. ఇద్దరు యువకుల అరెస్ట్ !

28 గ్రాముల గంజాయి స్వాధీనం.. విద్యార్థులు, యువతకు విక్రయించేందుకు యత్నం

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతాం: పోత్కపల్లి పోలీసులు

పోత్కపల్లి, అక్టోబర్ 16 (ప్రజావాణి ప్రతినిధి):

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాల నియంత్రణకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు చేపడుతున్న చర్యల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 28 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ మేరకు పోత్కపల్లి పోలీసులు వివరాలు వెల్లడించారు.

పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన నిందితులు

ఈ నెల 15వ తేదీన సాయంత్రం 6:30 గంటల సమయంలో పోత్కపల్లి రైల్వే స్టేషన్ ప్రాంతంలో పోలీసులు వాహనాలు, వ్యక్తులను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులను గమనించిన ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా, వారి వద్ద గంజాయి లభించింది.

పోలీసులు అరెస్ట్ చేసిన నిందితులను పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం రాములపల్లి గ్రామానికి చెందిన జక్కుల వినాయక్ (21), రేవెల్లి వంశీ (24)గా గుర్తించారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.700 విలువైన 28 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

చంద్రపూర్ నుంచి కొనుగోలు చేసి.. స్థానికంగా విక్రయించేందుకు యత్నం

పోలీసుల విచారణలో వెల్లడైన వివరాల ప్రకారం.. నిందితులు మహారాష్ట్రలోని చంద్రపూర్ ప్రాంతానికి వెళ్లి గుర్తుతెలియని వ్యక్తుల వద్ద తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఎలిగేడు, సుల్తానాబాద్, ఓదెల మండలాల్లోని విద్యార్థులు, యువతకు అధిక ధరలకు విక్రయించి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ అక్రమ రవాణాకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. తమ విలాసవంతమైన అలవాట్ల కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నట్లు విచారణలో వెల్లడైందని పేర్కొన్నారు.

ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు

ఈ ఘటనపై పోత్కపల్లి పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నారు.

యువత భవిష్యత్తుతో చెలగాటమాడితే కఠిన చర్యలు

గంజాయి, ఇతర మాదకద్రవ్యాలు యువత, విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తాయని పోలీసులు హెచ్చరించారు. మత్తు పదార్థాలను విక్రయించినా, అక్రమంగా రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

గంజాయి విక్రయాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు లేదా డయల్ 100కు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.