*క్రెసెంట్ గ్లోబల్ స్కూల్‌లో దాండియా సందడి!*
*సంప్రదాయ నృత్యాలతో హోరెత్తిన పాఠశాల ప్రాంగణం*
*విద్యార్థుల్లో సంస్కృతి, ఐక్యతాభావాన్ని పెంపొందించేందుకే సాంస్కృతిక వేడుకలు: మాద్రి తన్విశ్రీ
*ఉత్సాహంగా పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు*
పటాన్‌చెరు, అక్టోబర్ 11 (ప్రజావాణి): పటాన్‌చెరు డివిజన్ పరిధిలోని గౌతమ్‌నగర్‌లో ఉన్న క్రెసెంట్ గ్లోబల్ స్కూల్‌లో దాండియా ఉత్సవం–2026 వేడుకలు ఆదివారం అంగరంగ వైభవంగా జరిగాయి. సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు, తల్లిదండ్రులు చేసిన దాండియా నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. పాఠశాల యాజమాన్యం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ సతీమణి మాద్రి తన్విశ్రీ ముఖ్య అతిథిగా హాజరై వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాద్రి తన్విశ్రీ మాట్లాడుతూ.. విద్యార్థులకు పుస్తక జ్ఞానంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడం ఎంతో అవసరమన్నారు. ఇలాంటి సాంస్కృతిక వేడుకలు విద్యార్థుల్లో ఐక్యతాభావం, పరస్పర గౌరవం, స్నేహభావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు. చదువుతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యమిస్తూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు.
భారతీయ సంస్కృతి గొప్పతనాన్ని భావితరాలకు అందించడంలో విద్యాసంస్థలు కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు.
విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి వేడుకలు చక్కటి వేదికలుగా నిలుస్తాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, తల్లిదండ్రులు ఉత్సాహంగా దాండియా నృత్యాలు చేస్తూ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

