📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకన్నీటి వీడ్కోలు వేళ .... కడదాకా వీడని ఆశ

కన్నీటి వీడ్కోలు వేళ …. కడదాకా వీడని ఆశ

📰 Generate e-Paper Clip

కన్నీటి వీడ్కోలు వేళ …. కడదాకా వీడని ఆశ…. హుజురాబాద్ ప్రజావాణి సెప్టెంబర్: 10 ప్రేమించిన మనుషులు ఇక లేరనే నిజాన్ని గుండె అంత సులభంగా అంగీకరించలేదు. చివరి క్షణంలోనైనా ఏదో ఒక అద్భుతం జరిగి తమ మనిషి తిరిగి కళ్లు తెరుస్తుందేమోనన్న ఆశ మరణం ఎదుట కూడా పోరాడుతుంది. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ ఏరియా స్మశానవాటికలో శుక్రవారం రాత్రి జరిగిన ఘటన సరిగ్గా అలాంటి హృదయవిదారక భావోద్వేగానికే అద్దం పట్టింది. ​హుజూరాబాద్ పట్టణంలోని ఏకలవ్య కాలనీకి చెందిన కుతాడి సరిత (30) గత ఐదు రోజులుగా అనారోగ్యంతో పోరాడుతూ, చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే గుండెపోటుతో కన్నుమూసింది. ముప్పై ఏళ్ల ప్రాయంలోనే ఆమె తనువు చాలించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కన్నీటి వీడ్కోలు పలికేందుకు బంధువులు ఆమె మృతదేహాన్ని స్మశానవాటికకు చేర్చారు.

​చితిపై చిగురించిన ఆశ..
అంతిమ సంస్కారాలు నిర్వహించి చితిపై పెట్టే చివరి ఘడియల్లో బంధువుల్లో ఒకరికి ఆమె నాడి ఇంకా కొట్టుకుంటున్నట్లు అనిపించింది. తమ మనిషి ఎలాగైనా బతికితే బాగుండన్న తీవ్రమైన ఆకాంక్ష వారిలో ఒక్కసారిగా ఆశల దీపాన్ని వెలిగించింది. “మా సరిత బతికే ఉంది.. ప్రాణం పోలేదు!” అంటూ కన్నీళ్లతో వారు పడిన ఆరాటం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే 108 అత్యవసర విభాగానికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది.. చితి సమీపంలోనే ఆమెకు పల్స్, రక్తపోటు (బీపీ) పరీక్షించారు. అనుమానం నివృత్తి కోసం, ప్రాణం నిలబెట్టే ప్రయత్నంలో భాగంగా అక్కడే సీపీఆర్ కూడా చేసి చూశారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు సిబ్బంది నిర్ధారించారు. దీంతో క్షణకాలం చిగురించిన ఆశ కాస్తా తీరని వేదనగా మారి, బంధువుల రోదనలతో స్మశానవాటిక మిన్నంటింది. చివరి క్షణం వరకూ ఆశతో పోరాడిన కుటుంబ సభ్యులు, చేదు నిజాన్ని దిగమింగుకుని భారమైన గుండెతో అంత్యక్రియలు పూర్తి చేశారు. మృతురాలికి భర్త బిక్షపతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభంశుభం తెలియని చిన్నారులను విడిచి తల్లి అనంత లోకాలకు వెళ్లిపోవడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.