పెద్ద ఏడ్గీ జడ్పీహెచ్ఎస్ హై స్కూల్ లో ఘనంగా ముందస్తు బతుకమ్మ సంబరాలు..
విద్యాశాఖ అధికారి తిరుపతయ్య ఆధ్వర్యంలో..
వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్
ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి
అక్టోబర్ 09
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని పెద్ద ఏడ్గీ జడ్.పి.హెచ్.ఎస్ ఉన్నంత పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు విద్యాశాఖ అధికారి తిరుపతయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. సర్పంచ్ అనిల్ కుమార్ అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారి తిరుపతయ్య మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక అని, పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధించే విశిష్టమైన పండుగ అని పేర్కొన్నారు. విద్యార్థినులు, ఉపాధ్యాయులు కలిసి సంప్రదాయబద్ధంగా, ఉత్సాహంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో విద్యాసంస్థల పాత్ర ఎంతో కీలకమని తెలిపారు.
అనంతరం రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మల చుట్టూ విద్యార్థినులు, ఉపాధ్యాయినులు, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. విద్యార్థినులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఈ కార్యక్రమంలో ట్రినిటీ విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

