జనగామలో నూతన లాడ్జి, వస్త్ర దుకాణంను ప్రారంభించిన ఎమ్మెల్యే పల్లా
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 05 (ప్రజావాణి) : జనగామ పట్టణ కేంద్రంలో సోమవారం వరుస ప్రారంభోత్సవాలు ఘనంగా జరిగాయి. నూతనంగా ఏర్పాటు చేసిన వాణిజ్య సంస్థల ప్రారంభోత్సవాల్లో జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
జనగామ పట్టణంలోని ప్రధాన ప్రాంతంలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రాండ్ ఎస్ఎల్ఎన్ లాడ్జి డీలక్స్ ను ఎమ్మెల్యే మొదటగా ప్రారంభించారు. ఈ సందర్భంగా లాడ్జి నిర్వాహకులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. జనగామ పట్టణం రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని, జిల్లా కేంద్రం కావడంతో వివిధ ప్రాంతాల నుండి వచ్చే ప్రజలకు, వ్యాపారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు ఆధునిక వసతులతో కూడిన లాడ్జిలు అందుబాటులోకి రావడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ లాడ్జి ద్వారా ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందుతాయని ఆకాంక్షించారు.
అనంతరం పట్టణంలోనే నూతనంగా ఏర్పాటు చేసిన ఎఎస్ ఫ్యాషన్ షో జోన్ మెన్స్ వేర్ స్టోర్ ను స్థానిక 2వ వార్డు కౌన్సిలర్ రామగాళ్ల విజయ్ కుమార్ తో కలసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
పట్టణంలో ఇలాంటి నూతన వాణిజ్య సంస్థలు ఏర్పాటు కావడం ద్వారా ప్రజలకు లేటెస్ట్ ఫ్యాషన్ దుస్తులు అందుబాటు ధరల్లో అందుబాటులోకి వస్తాయని, అదే విధంగా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన దుస్తులు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు.
ఈ రెండు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు, లాడ్జి మరియు స్టోర్ యాజమాన్యం, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

