*ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి*
*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 05 (ప్రజావాణి): ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు.
సోమవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) బెన్షాలోమ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు.
ఈ సందర్భంగా *(405)* అర్జీలను *కలెక్టర్* స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని, పెండింగ్ లో లేకుండా దరఖాస్తులను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలని ఆదేశించారు.
ఈరోజు ప్రజావాణికి వచ్చిన కొన్నింటి దరఖాస్తుల వివరాలిలా ఉన్నాయి
హిమ్మత్ నగర్ గ్రామం, జఫర్గడ్ మండలానికి చెందిన సీహెచ్. అనిత, తనకు పెంకుటిల్లు ఉందని, అది కూలిపోయిందని, ఇందిరమ్మ ఇళ్ల కింద గుర్తించి, ఆర్థిక సహాయం కొరకు మనవి చేస్తూ దరఖాస్తు చేసుకున్నారు.
నెల్లుట్ల గ్రామం, లింగాల ఘనపురం మండలానికి చెందిన బండ్రు సారమ్మ, తనకు మూడు ఎకరాల భూమి ఉందని, అందులోని 16 గుంటల భూమి రికార్డులోకి ఎక్కలేదని, ఆ భూమిని రికార్డులోకి ఎక్కించి, పట్టా ఇప్పించగలరని దరఖాస్తు చేసియున్నారు.
నారాయణపురం గ్రామం, బచ్చన్నపేట మండలానికి చెందిన రవీందర్ రెడ్డి, సదాశివపేట, నారాయణపురం మధ్యలో కాలువ తెగిపోయిందని, కాలువ మరమ్మతులు చేయాలని ప్రార్థిస్తూ ఆర్జీ ద్వారా కోరారు.

పామ్నూర్ గ్రామం, ఘనపూర్ (స్టేషన్) మండలానికి చెందిన రేష్మా, తన పెంకుటిల్లు కూలిపోయే దశలో ఉందని, చాలా పేద కుటుంబానికి చెందినదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయగలరని కోరుతూ వినతిపత్రం సమర్పించనైనది.
విస్నూర్ గ్రామం, పాలకుర్తి మండలానికి చెందిన ఎం. సుజాత, ఇందిరమ్మ ఇల్లు ఇప్పించుట కోసం దరఖాస్తును సమర్పించినారు.
ఈ ప్రజావాణిలో జెడ్పీ సీఈవో బలరామ రావు, డీఆర్డీఓ భాస్కర్, సీపీఓ చిన కోట్యా నాయక్, వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

