📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజాతీయ స్థాయి క్రీడలకు కనగర్తి విద్యార్థి

జాతీయ స్థాయి క్రీడలకు కనగర్తి విద్యార్థి

📰 Generate e-Paper Clip

జాతీయ స్థాయి క్రీడలకు కనగర్తి విద్యార్థి

జావెలిన్ త్రోలో 40.34 మీటర్లు విసిరి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఒళ్ళే అక్షయ్ కార్తి

కనగర్తి దాసరి పద్మ–హన్మయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి ఒళ్ళే అక్షయ్ కార్తి జాతీయ స్థాయి క్రీడా పోటీలకు ఎంపికై సత్తా చాటాడు. నవంబర్‌లో జరగనున్న 20వ జాతీయ అంతర్‌జిల్లా జూనియర్ అథ్లెటిక్స్ మీట్–2026లో పాల్గొనే అవకాశం అక్షయ్ కార్తికి లభించింది.

ఇటీవల నిర్వహించిన ఎన్‌ఐడీజేఏఎం జిల్లా టోర్నమెంట్‌లో 16 సంవత్సరాల విభాగం జావెలిన్ త్రోలో అక్షయ్ కార్తి 40.34 మీటర్ల దూరం విసిరి ప్రతిభ కనబరిచాడు. ఈ ప్రతిభ ఆధారంగా జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైనట్లు ఓదెల మండల విద్యాధికారి ఎర్ర రమేష్ పత్రికా ప్రకటనలో తెలిపారు.

ఐదేళ్ల కఠోర సాధనకు దక్కిన ఫలితం

అక్షయ్ కార్తి 6వ తరగతి నుంచే అథ్లెటిక్స్‌లో ఆసక్తి కనబరుస్తూ క్రమం తప్పకుండా సాధన చేస్తున్నాడు. గత ఐదేళ్లలో ఇప్పటికే ఏడుసార్లు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నాడు. నిరంతర సాధన, పట్టుదల, క్రీడపై ఉన్న ఆసక్తి కారణంగానే ఇప్పుడు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యే అరుదైన అవకాశం దక్కిందని పాఠశాల వర్గాలు పేర్కొన్నాయి.

జాతీయ స్థాయి పోటీల్లో మరింత మెరుగైన ప్రదర్శన చేయాలనే లక్ష్యంతో ప్రణాళికాబద్ధంగా ప్రత్యేక శిక్షణ కొనసాగిస్తున్నట్లు పాఠశాల పీడీ శ్రీ విష్ణు తెలిపారు. జావెలిన్ త్రోలో సాంకేతిక నైపుణ్యంతో పాటు శారీరక దారుఢ్యం, ఏకాగ్రత, సమయపాలనకు ప్రాధాన్యతనిస్తూ సాధన చేయిస్తున్నట్లు పేర్కొన్నారు.

క్రమశిక్షణతో సాధన

కోచ్, పీడీ శ్రీ విష్ణు ఆధ్వర్యంలో ప్రతిరోజూ క్రమం తప్పకుండా సాధన చేస్తున్నట్లు విద్యార్థి అక్షయ్ కార్తి తెలిపాడు. జాతీయ స్థాయి పోటీల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవసరమైన ఆహారం, శారీరక దారుఢ్యానికి సంబంధించిన మెలకువలు, జావెలిన్ త్రోలో సాంకేతిక అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ముమ్మరంగా శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పాడు.

గ్రామ స్థాయి నుంచి క్రీడా ప్రయాణాన్ని ప్రారంభించి జాతీయ స్థాయికి చేరుకోవడం కనగర్తి గ్రామానికి, ఓదెల మండలానికి గర్వకారణమని గ్రామ సర్పంచ్ చొప్పరి సంధ్యా కుమార్, ఉపసర్పంచ్ మచ్చ సాయి రాణితో పాటు గ్రామ పాలకవర్గ సభ్యులు పేర్కొన్నారు. అక్షయ్ కార్తిని అభినందిస్తూ, జాతీయ స్థాయిలో కూడా ప్రతిభ కనబరిచి గ్రామానికి, పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.