📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు

విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు

📰 Generate e-Paper Clip

విద్యుత్ కోతలతో ఎండిపోతున్న పంటలు

24 గంటల కరెంట్ కాదు.. కనీసం 16 గంటలైనా ఇవ్వాలి

పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడాలి : సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు

గరిడేపల్లి, అక్టోబర్ 4 (ప్రజావాణి): సాగర్ ఆయకట్టు పరిధిలో విద్యుత్ కోతల కారణంగా పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని, రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం కనీసం 8 నుంచి 10 గంటల విద్యుత్ కూడా సక్రమంగా సరఫరా చేయడం లేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోకల వెంకటేశ్వర్లు విమర్శించారు.

ఆదివారం గరిడేపల్లి మండల కేంద్రంలో జరిగిన సీపీఐ మండల సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయానికి అందుతున్న విద్యుత్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. ఒకసారి విద్యుత్ వచ్చినా తరచూ సరఫరా నిలిచిపోవడంతో పొలాలకు సక్రమంగా నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతులకు 24 గంటల ఉచిత, నాణ్యమైన విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చి, ప్రజలను నమ్మించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత ప్రభుత్వంతో పోలిస్తే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ప్రస్తుతం సాగర్ ఆయకట్టు పరిధిలో వేలాది ఎకరాల్లో వరి పంట పొట్ట దశలో ఉందని, ఈ కీలక సమయంలో విద్యుత్ కోతలు విధిస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. 24 గంటల విద్యుత్ ఇవ్వడం సాధ్యం కాకపోయినా కనీసం రోజుకు 16 గంటల పాటు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసి పంటలను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.

ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు లేక విద్యుత్ ఉత్పత్తి జరగడం లేదని చెప్పడం సరికాదన్నారు. అవసరమైతే ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసి అయినా రైతులు సాగు చేసిన పంటలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. విద్యుత్ కొరత పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేస్తే వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

సాగర్ ఆయకట్టు పరిధిలో ఎండిపోతున్న పంట పొలాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి, కోతలు లేని విద్యుత్ సరఫరా చేసి పొట్ట దశలో ఉన్న వరి పంటలను కాపాడాలని పోకల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి కడియాల అప్పయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి త్రిపురం సుధాకర్ రెడ్డి, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు యడ్ల అంజిరెడ్డి, చెవ్వ వెంకన్న, వెంకటరెడ్డి, పోకల ఆంజనేయులు, తిరగమళ్ల కిరణ్, కట్టా అశోక్, పంగ గోవిందు, ప్రధాని సైదులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.