📄 ePaper
Epaper 2
Tuesday, September 29, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణRajanna Sircillaఆర్టీఐ దరఖాస్తుకు 15 నెలలైనా సమాధానం ఏదీ

ఆర్టీఐ దరఖాస్తుకు 15 నెలలైనా సమాధానం ఏదీ

📰 Generate e-Paper Clip

*ఆర్టీఐ దరఖాస్తుకు 15 నెలలైనా సమాధానం ఏదీ*..?

•••ప్రైవేట్ పాఠశాలల వివరాలు కోరిన
దరఖాస్తుదారుడికి తప్పని నిరీక్షణ…!

••డీఈవో కార్యాలయ తీరుపై ఫిర్యాదుదారుడి అసంతృప్తి.

•• ప్రజావాణి లో ఫిర్యాదు చేసిన దేవేందర్.

రాజన్న సిరిసిల్ల, ప్రజావాణి

సమాచారం కోరేందుకు ఉన్న సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకున్నా.. సమాధానం మాత్రం అందని పరిస్థితి నెలకొందని దరఖాస్తుదారుడు అబ్రమేని దేవేందర్ ఆరోపించారు. ముస్తాబాద్ మండలానికి చెందిన అబ్రమేని దేవేందర్ ప్రైవేట్ పాఠశాలకు సంబంధించిన వివరాల కోసం దరఖాస్తు చేసి సుమారు 15 నెలలు గడిచినా పూర్తి సమాచారం అందలేదని ఆరోపిస్తున్నారు.
మండలంలోని ఓ ప్రైవేట్ పాఠశాల భవనం నిబంధనలకు అనుగుణంగా నిర్మించారా…? గ్రామపంచాయతీకి సమర్పించిన మ్యాప్ ప్రకారమే నిర్మాణం జరిగిందా…? తదితర వివరాలను ఆయన కోరినట్లు తెలిపారు. దీంతో పాటు పాఠశాల యాజమాన్యం విద్యాశాఖకు సమర్పించిన నిర్మాణ పత్రాలు, ప్లే గ్రౌండ్, ల్యాబ్, లైబ్రరీ, ఫైర్ సేఫ్టీ, టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి సంబంధించిన వివరాలను కూడా ఆర్టీఐ ద్వారా అడిగినట్లు పేర్కొన్నారు.

*దరఖాస్తు ఇచ్చినా.. సమాచారం మాత్రం లేదు*

ఆర్టీఐ దరఖాస్తు స్వీకరించినప్పటికీ ఇప్పటివరకు కోరిన పూర్తి సమాచారం ఇవ్వలేదని దేవేందర్ చెబుతున్నారు. చట్టం నిర్దేశించిన సమయంలో సమాచారం అందాల్సి ఉండగా, నెలలు గడుస్తున్నా స్పందన లేకపోవడంపై ఆయన ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.

*ప్రజావాణిలో ఫిర్యాదు*

సమాచారం కోసం పలుమార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో దేవేందర్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. తన దరఖాస్తును ఎందుకు పెండింగ్‌లో ఉంచారో విచారణ జరిపి, కోరిన సమాచారాన్ని వెంటనే అందించాలని అధికారులను కోరారు.
ఇదే సమయంలో కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తూ సమాచారం ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారంటూ అధికారులపై ఆయన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత అధికారుల వివరణ వెలువడాల్సి ఉంది.

*ఆర్టీఐకి 30 రోజులు.. ఇక్కడ 15 నెలలు ఎందుకు*?

సమాచార హక్కు చట్టం కింద సాధారణంగా నిర్ణీత గడువులో సమాచారం అందించాల్సి ఉండగా, ఒక దరఖాస్తుకు 15 నెలలుగా సమాధానం ఎందుకు రాలేదన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. దరఖాస్తు ఏ స్థాయిలో పెండింగ్‌లో ఉంది? సమాచారం ఇవ్వడంలో జాప్యానికి కారణం ఏమిటి? బాధ్యులు ఎవరు? అనే అంశాలపై ఉన్నతాధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఆర్టీఐ దరఖాస్తుపై సమగ్రంగా విచారణ జరిపి, వాస్తవాలను వెల్లడించడంతో పాటు నిబంధనల ప్రకారం సమాచారం అందించాలని ఫిర్యాదుదారుడు కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.