📄 ePaper
Epaper 2
Monday, September 28, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపార అవకాశాలు

పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపార అవకాశాలు

📰 Generate e-Paper Clip

*పర్యాటక అభివృద్ధికి జిల్లాలో అపార అవకాశాలు*

*జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్*

* *మన ప్రజావాణి* మంచిర్యాల జిల్లా ప్రతినిధి:-

ప్రకృతి వనరులు, పర్యావరణ సమతుల్యత, చారిత్రక, ఆధ్యాత్మిక, సాహస పర్యాటకానికి జిల్లాలో అపార అవకాశాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు జిల్లా అటవీ అధికారి రాహుల్ కిషన్ జాదవ్, జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, జిల్లా రెవెన్యూ అధికారి మోతీరామ్, జిల్లా పర్యాటక నోడల్ అధికారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, మంచిర్యాల రాజస్వ మండల అధికారి జి శ్రీనివాసరావు లతో కలిసి హాజరై, జిల్లా పర్యాటక స్థలాల గురించి జిల్లా టూరిజం నోడల్ అధికారి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ తయారు చేసిన మంచిర్యాల టూరిజం డిపార్ట్మెంట్ లోగోతో పాటు టూరిజం మ్యాగజైన్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు ఉన్న సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుతం పర్యాటకుల రాక తక్కువగా ఉందని, జిల్లాలోని పర్యాటక ప్రదేశాలను విస్తృతంగా ప్రచారం చేసి పర్యాటకుల సంఖ్యను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాల వివరాలను మ్యాగజైన్‌తో పాటు జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో ఎకో టూరిజంతో పాటు టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి చర్యలు చేపడుతున్నామని, సాహస పర్యాటకానికి అనువైన ప్రాంతాలలో రాక్ క్లైంబింగ్ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడంతో పాటు, శివ్వారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వంటి ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలను పరిశీలించాలని, తాడోబా వైపు వెళ్లే మార్గంలో మంచిర్యాల జిల్లాలో పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి మంచి అవకాశాలు ఉన్నాయని తెలిపారు. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయాన్ని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సముచితంగా వినియోగించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాఠశాల విద్యార్థులను వివిధ పర్యాటక ప్రదేశాలకు ఎక్స్కర్షన్‌లకు తీసుకెళ్లేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. విద్యార్థులకు పర్యాటకంపై క్విజ్‌లు, పోటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా పర్యాటక ప్రాధాన్యతపై అవగాహన పెంపొందించవచ్చని, ప్రజలు, అధికారులు, సంబంధిత శాఖలు సమిష్టిగా కృషి చేస్తే జిల్లాలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చని తెలిపారు. జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) మాట్లాడుతూ, పర్యాటక అభివృద్ధిలో భాగంగా జిల్లాలోని గూడెం సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి నిధులు కేటాయించి పనులు కొనసాగుతున్నాయని, గోదావరి పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గాంధారి ఖిల్లా, సింగరేణి సంస్థ ద్వారా నల్ల బంగారమైన బొగ్గు నిల్వల వెలికితీత వంటి జిల్లాలోని చారిత్రక, పారిశ్రామిక విశేషాలను పర్యాటక రంగం ద్వారా ప్రజలకు పరిచయం చేయవలసిన అవసరం ఉందని తెలిపారు. పర్యాటక ప్రదేశాలు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించడంతో పాటు చారిత్రక, సాంస్కృతిక అంశాలను ప్రాచుర్యంలోకి తీసుకువస్తాయని తెలిపారు. జ్ఞాన భారతం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పురాతన మాన్యుస్క్రిప్టులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని, వాటిని సంరక్షించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ద్వారా జిల్లాలోని చారిత్రక వారసత్వాన్ని మరింత ప్రాచుర్యంలోకి తీసుకురావచ్చని తెలిపారు. వివిధ పర్యాటక ప్రాంతాలను అనుసంధానిస్తూ టూరిజం సర్క్యూట్‌లను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని తెలిపారు.ఈ సందర్భంగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పాఠశాల, ఇంటర్మీడియట్ స్థాయిలో పర్యాటకంపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, పెయింటింగ్ పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.