📄 ePaper
Epaper 2
Tuesday, September 22, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJangaonజీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి

📰 Generate e-Paper Clip

*జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలి*

*కార్తీక మాస బ్రహ్మోత్సవాలకు భక్తులకు మెరుగైన సౌకర్యాలే లక్ష్యం*

*శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి*

*ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి*

*జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా*

జనగామ జిల్లా ప్రతినిధి, సెప్టెంబర్ 22(ప్రజావాణి):
జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు.

మంగళవారం, జిల్లాలోని లింగాల ఘనపూర్ మండలంలోని జీడికల్ గ్రామంలో గల శ్రీ రామచంద్ర స్వామి ఆలయ ప్రాంగణంలో 2026 కార్తీక మాస బ్రహ్మోత్సవాలు, జాతర ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లతో కలిసి ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి గొప్ప చరిత్ర, ప్రాశస్త్యం ఉందని అన్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో రెండు నెలల ముందుగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

నవంబర్ 24 నుంచి 29 వరకు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పారిశుద్ధ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ఆలయం చుట్టూ కనీసం ఒక కిలోమీటరు పరిధిలో పరిశుభ్రతను నిరంతరం నిర్వహించేలా సూక్ష్మ స్థాయిలో ప్రణాళిక రూపొందించాలని సూచించారు. గతసారి సుమారు 25 వేల మంది భక్తులు హాజరయ్యారని, ఈసారి 40 వేల మందికి పైగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలన్నారు.

మిషన్ భగీరథ ద్వారా శుద్ధ తాగునీరు, ముడి నీటి సరఫరా చేయాలన్నారు. అలాగే శాశ్వత టాయిలెట్ బ్లాక్‌లను తగిన నీటి, విద్యుత్ సరఫరాతో నిర్మించాలని సూచించారు.

జనగామ–జీడికల్ రహదారి పనులను పూర్తి చేయాలని, ఆలయం ఎదురుగా ఉన్న ఫోర్‌లైన్ రోడ్డులో మీడియన్ అభివృద్ధి, హార్టికల్చర్ శాఖ ద్వారా పచ్చదనం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామంలో ఆలయం నుంచి వెళ్లే మూడు కిలోమీటర్ల రహదారి పనులను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆర్ అండ్ బి అధికారులకు సూచించారు.

ఆలయ కళ్యాణ మండపం సమీపంలోని భూమిలో పచ్చదనం, చిన్నపాటి పార్కును అభివృద్ధి చేయాలని, ఆలయ పరిసరాల్లో లెవలింగ్, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించాలని సూచించారు.

బ్రహ్మోత్సవాలను బ్రహ్మాండంగా నిర్వహించి, జీడికల్ శ్రీ రామచంద్ర స్వామి ఆలయ ఖ్యాతిని మరింత పెంచాలని పిలుపునిచ్చారు.

ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను శాఖల వారీగా కార్యాచరణ ప్రణాళికతో చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా, ఫెన్సింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. ఈఈ పీఆర్ ద్వారా సీసీ రోడ్లు, సెంట్రల్ లైటింగ్, తదితర పనుల అంచనాలను సిద్ధం చేయాలన్నారు.

వైద్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాలు, 108 అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉంచాలన్నారు. ఆలయ ప్రాంగణాల్లో లైటింగ్, డెకరేషన్ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు.

బ్రహ్మోత్సవాల కోసం రూట్ మ్యాప్ ను సిద్ధం చేయాలన్నారు. రూట్ మ్యాప్‌కు క్యూఆర్ కోడ్ రూపొందించి జిల్లా, పోలీసు వెబ్‌సైట్లలో ఉంచాలన్నారు. సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.

అనంతరం డీసీపీ మాట్లాడుతూ.. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల కోసం సమగ్ర పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నట్లు వివరించారు. బందోబస్తును పటిష్ఠంగా నిర్వహించి, షీ టీమ్స్, క్రైమ్ టీమ్స్, పోలీసు సిబ్బందిని ప్రత్యేకంగా మోహరించనున్నట్లు తెలిపారు.

*సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ*

అనంతరం (30) మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఘనపూర్ (స్టేషన్) ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అందజేశారు.

అంతకుముందు ఘనపూర్ (స్టేషన్) శాసనసభ్యులు కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, డీసీపీ రాజ మహేంద్ర నాయక్ లకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంగళవాయిద్యాల నడుమ, వేదమంత్రోచ్చారణల మధ్య అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి ప్రసాదాన్ని వారికి అందించారు.

*జాతర ప్రధాన తేదీలు*

* జాతర ప్రారంభం: 23-11-2026 (సోమవారం)

* కార్తీక పౌర్ణమి: 24-11-2026 (మంగళవారం)

* ఎదురుకోళ్లు: 27-11-2026 (శుక్రవారం)

* కళ్యాణం: 28-11-2026 (శనివారం)

* రథోత్సవం: 29-11-2026 (ఆదివారం)

* జాతర ముగింపు: 05-12-2026 (శనివారం)

ఈ సమీక్ష సమావేశంలో జనగామ ఆర్డీఓ గోపీరాం, ఎంపీడీఓ శివశంకర్ రెడ్డి, తహసీల్దార్ ఆండాలు, ఆలయ కమిటీ ఛైర్మన్ మూర్తి, ఈఓ వంశీ, సర్పంచ్, డీఎంహెచ్‌వో వాణిశ్రీ, ఎస్‌ఈ ఎన్‌పీడీసీఎల్ సంపత్ రెడ్డి, మిషన్ భగీరథ ఇన్‌ట్రా ఈఈ శ్రీకాంత్, ఈఈ పీఆర్ రవీందర్, వివిధ శాఖల సంబంధిత జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.