📄 ePaper
Epaper 2
Sunday, September 20, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపొలంలో ఫామ్ ఫండ్ ఉంటే.. కరువుకు చింత లేదు

పొలంలో ఫామ్ ఫండ్ ఉంటే.. కరువుకు చింత లేదు

📰 Generate e-Paper Clip

*పొలంలో ఫామ్ ఫండ్ ఉంటే.. కరువుకు చింత లేదు!*
*రాయికల్, సెప్టెంబర్ 20 (ప్రజావాణి):*

“ఇకపై రైతు ఆకాశం వైపు చూడాల్సిన పని లేదు, తన పొలంలోనే తన నీటి భద్రతను తానే ఏర్పాటు చేసుకోవచ్చునని” మండల అభివృద్ధి అధికారి బింగి చిరంజీవి పేర్కొన్నారు. వాతావరణం అనిశ్చితంగా మారిన వేళ కురిసిన వర్షపు నీటిని ఒడిసిపట్టి నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకమే పంట సంజీవని కుంట (ఫామ్ ఫండ్) అని ఆయన తెలిపారు.పంట పొలంలోనే ఫామ్ ఫండ్ ను తవ్వుకోవడం వల్ల రైతుకు కలిగే మేలు అంతా ఇంతా కాదని ఆయన వివరించారు. పంటకు పూత, గింజ తయారయ్యే కీలక దశలో వర్షం అందకపోతే రైతు తీవ్రంగా నష్టపోతాడు. అలాంటి సమయంలో ఈ ఫామ్ ఫండ్ లో నిల్వ ఉన్న నీటితో ఒక్క తడి ఇస్తే చాలు ఎండిపోతున్న పంట తిరిగి బతుకుతుందని, దీంతో దిగుబడి 30 నుంచి 40 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని తెలిపారు.అంతేకాకుండా ఈ ఫామ్ ఫండ్ లోని నీరు నెమ్మదిగా భూమిలోకి ఇంకడం వల్ల 200 నుంచి 300 మీటర్ల పరిధిలోని బోర్లు, బావుల్లో నీటి మట్టం 2 నుంచి 3 మీటర్ల వరకు పెరుగుతుందని, భూమిలో తేమ శాతం పెరిగి రెండో పంటకు కూడా ఆసరా అవుతుందని వివరించారు.ఈ పంట సంజీవని కుంట(ఫామ్ ఫండ్)కేవలం నీటి గుంత మాత్రమే కాదని, అది ఆదాయపు వనరు అని ఆయన పేర్కొన్నారు. ఈ కుంటలో 6 నెలల పాటు నీరు నిలిచి ఉంటుందని, అందులో చేప పిల్లలను వదిలితే పెద్దగా మేత ఖర్చు లేకుండానే 20 వేల నుంచి 30 వేల రూపాయల వరకు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. అలాగే కుంట తవ్విన మట్టితో ఏర్పడిన గట్టుపై నేపియర్ గడ్డి, సొర, బీర, కాకర వంటి కూరగాయలు పండించవచ్చని, ఇది పశువులకు మేతగా, ఇంటి అవసరాలకు, మార్కెట్లో అమ్ముకునేందుకు ఉపయోగపడుతుందని అన్నారు. వేసవిలో పశువులు, గొర్రెలు, మేకలకు తాగునీటి కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పని లేకుండా ఈ కుంట ఉపయోగపడుతుందని చెప్పారు.ఈ ఫామ్ ఫండ్ తవ్వకానికి రైతు ఒక్క రూపాయి కూడా పెట్టాల్సిన అవసరం లేదని, గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కూలీలతోనే తవ్విస్తామని,కూలీ డబ్బును ప్రభుత్వమే నేరుగా చెల్లిస్తుందని ఆయన స్పష్టం చేశారు. రైతు కేవలం తన పొలంలో స్థలం చూపిస్తే చాలునని, ఆసక్తి గల రైతులు తమ భూమి పత్రం నకలుతో పంచాయతీ కార్యదర్శి/ఫీల్డ్ అసిస్టెంట్ లేదా ఏపీవో ను సంప్రదించి వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.