📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్భూకబ్జాదారుల ఆక్రమణల్లోని 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, పేదలకు పంచాలి: వ్యవసాయ కార్మిక...

భూకబ్జాదారుల ఆక్రమణల్లోని 1200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని, పేదలకు పంచాలి: వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్

📰 Generate e-Paper Clip

కాశినాయన సెప్టెంబర్ 19 ప్రజావాణి రాజకీయ పలుకుబడితో భూకబ్జాదారులు అక్రమంగా ఆక్రమించుకున్న ప్రభుత్వ భూములను తక్షణమే స్వాధీనం చేసుకుని, భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ), తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకుల దౌర్జన్య పూరిత ఆక్రమణలకు వ్యతిరేకంగా శనివారం ఉదయం కాశినాయన మండల పరిధిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉధృత భూపోరాటం నిర్వహించారు. నాయనపల్లె, వరి కుంట్ల గ్రామాలకు చెందిన వందలాది మంది పేదలు, వ్యవసాయ కార్మికులు ఎర్రజెండాలు చేతబూని ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు.ఈ పోరాట కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు ఎం. బడి పోలయ్య మాట్లాడుతూ.. కాశినాయన మండల పరిధిలోని నాయనపల్లె రెవెన్యూ పొలం సర్వే నెంబర్లు 129, 130, 131, 219, 217లలో ఉన్న దాదాపు 1200 ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు రాజకీయ నాయకులు దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దశాబ్దాలుగా ఆ భూములను నమ్ముకుని సాగు చేసుకుంటున్న పేదలను అన్యాయంగా, బలవంతంగా బయటకు నెట్టేసి ఈ భూములను హస్తగతం చేసుకున్నారని ఆరోపించారు.రాష్ట్రంలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లకు పైగా గడుస్తున్నప్పటికీ, ఈ భూకబ్జాదారులపై చర్యలు తీసుకోవడంలో కానీ, ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో కానీ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని వారు విమర్శించారు. వరికుంట, నాయనపల్లె గ్రామాలకు చెందిన పేదలు తమకు న్యాయం చేయాలని కోరుతూ గతంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ), ఆర్డీఓతో పాటు కాశినాయన మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట పలుమార్లు నిరాహార దీక్షలు, ధర్నాలు చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ అధికారులు కబ్జాదారులకు కొమ్ముకాస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు.అధికారుల నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన నిరుపేదలకు గత్యంతరం లేని పరిస్థితిలోనే వ్యవసాయ కార్మిక సంఘం అండతో ఈ భూపోరాటానికి శ్రీకారం చుట్టాల్సి వచ్చిందని నాయకులు స్పష్టం చేశారు. స్థానిక రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ తక్షణమే స్పందించి సర్వే నెంబర్ల వారీగా ఆక్రమణలను తొలగించాలని డిమాండ్ చేశారు. నిరుపేద కుటుంబాలైన నాయనపల్లె, వరికుంట్ల గ్రామ ప్రజలకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాల చొప్పున భూమిని పంపిణీ చేసి, సాగు హక్కులు కల్పించాలని కోరారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి భూపంపిణీ చేపట్టకపోతే రాబోయే రోజుల్లో ఈ భూపోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షులు వరికుంట్ల బాబు, నాయకులు ప్రభాకర్, లక్ష్మయ్య, దాస్, హుస్సేన్, పీరయ్యతో పాటు నాయనపల్లె, వరికుంట్ల గ్రామాల వ్యవసాయ కార్మికులు, నిరుపేద మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కబ్జాదారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.