📄 ePaper
Epaper 2
Saturday, September 19, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్రాజంపేటలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు: బాల్య వివాహాలు, మొబైల్ వాడకంపై న్యాయమూర్తుల కీలక సూచనలు

రాజంపేటలో ఘనంగా న్యాయ విజ్ఞాన సదస్సు: బాల్య వివాహాలు, మొబైల్ వాడకంపై న్యాయమూర్తుల కీలక సూచనలు

📰 Generate e-Paper Clip

రాజంపేట: సెప్టెంబర్ 19 ప్రజావాణి విద్యార్థులు చిన్నతనం నుంచే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉంటూ చట్టబద్ధమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీ యస్. ప్రవీణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి పి.రాజన్ ఉదయ్ ప్రకాశ్ పిలుపునిచ్చారు. రాజంపేట మండల న్యాయసేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ నందు శనివారం “బాలల హక్కులు – బాలల సంబంధాలు” అనే అంశంపై న్యాయ విజ్ఞాన అవగాహన సదస్సును అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ సదస్సుకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా న్యాయమూర్తి శ్రీ యస్. ప్రవీణ్ కుమార్, జూనియర్ సివిల్ జడ్జి పి.రాజన్ ఉదయ్ ప్రకాశ్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ, దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందనడానికి వారి చట్టబద్ధమైన ప్రవర్తనే నిదర్శనమన్నారు. సమాజంలో ఎక్కడైనా, ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు అధైర్యపడకుండా రాజంపేట మండల న్యాయసేవా అధికార సంస్థను ఆశ్రయించి ఉచిత న్యాయ సహాయాన్ని పొందవచ్చని, బాధితులకు ఈ సంస్థ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.నేటి సమాజంలో బాల్య వివాహాలు ఒక పెద్ద శాపంగా మారాయని న్యాయమూర్తులు ఆందోళన వ్యక్తం చేశారు. చట్టం ప్రకారం నిర్దేశించిన వివాహ వయస్సును ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడానికి సమాజంలోని ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని సూచించారు. అదేవిధంగా ప్రస్తుత డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లకు బానిసలై తమ విలువైన సమయాన్ని, భవిష్యత్తును పాడు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు మొబైల్ ఫోన్ల వాడకానికి వీలైనంత దూరంగా ఉంటూ, చదువుపైనే పూర్తి దృష్టి సారించాలని హితవు పలికారు.బాలలపై జరిగే లైంగిక దాడులు, వేధింపులను అరికట్టేందుకు ఉన్న పోక్సో (POCSO) చట్టం గురించి విద్యార్థులకు వివరిస్తూ, ఈ చట్టం కింద నేరాలకు పాల్పడే వారికి కటిక శిక్షలతో పాటు నేరం తీవ్రతను బట్టి మరణశిక్ష కూడా విధించే అవకాశం ఉందని స్పష్టం చేశారు.ఎవరూ కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదని, అసాంఘిక నేరాలకు పాల్పడితే జీవితాలు అంధకారమవుతాయని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ చట్ట పరిధికి లోబడి బాధ్యతాయుతమైన పౌరులుగా జీవించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మన్నూరు ఎస్ ఐ హుస్సేన్ మాట్లాడుతూ శాంతిభద్రతల పరిరక్షణకు, నేర రహిత సమాజ స్థాపనకు పోలీసు శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని, విద్యార్థులు చట్ట వ్యతిరేక పనుల వైపు ఆకర్షితులు కాకుండా జాగ్రత్త పడాలని కోరారు. ఇన్ఫాంట్ జీసస్ స్కూల్ హెడ్ మాస్టర్ ఫాతిమా మాట్లాడుతూ తమ పాఠశాల విద్యార్థులకు ఇలాంటి న్యాయ విజ్ఞాన సదస్సు ద్వారా ఎన్నో ఉపయోగకరమైన విషయాలు తెలియజేశారని న్యాయమూర్తులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సదస్సులో సీనియర్ న్యాయవాదులు శ్రీనివాసులు, కవలకుంట్ల పాపయ్య, స్థానిక పోలీసు సిబ్బంది, కోర్టు సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయ బృందంతో పాటు సుమారు 300 మంది విద్యార్థులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా సమాధానాలు ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.