📄 ePaper
Epaper 2
Friday, September 18, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమట్టి గణపతితో.. ప్రకృతికి రక్ష

మట్టి గణపతితో.. ప్రకృతికి రక్ష

📰 Generate e-Paper Clip

*మట్టి గణపతితో.. ప్రకృతికి రక్ష!

*మనం మారితే.. లోకం మారుతుంది!

*ఓడీఎఫ్‌ కాలనీలో భారతీయం సత్యవాణి ప్రవచనాలు..

* సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన

అమీన్‌పూర్‌, సెప్టెంబర్‌ 17 (ప్రజావాణి): అమీన్‌పూర్‌ డివిజన్‌ పరిధిలోని ఓడీఎఫ్‌ కాలనీలో భక్తి సందడి నెలకొంది. వినాయక చవితిని పురస్కరించుకుని భారతీయం సత్యవాణి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ సనాతన ధర్మం, వినాయకుడి ఆరాధన, సంస్కృతి, సంప్రదాయాల విశిష్టతపై ఆమె అవగాహన కల్పించారు.
మట్టి వినాయకుడిని పూజించాలి.. ప్రకృతిని కాపాడాలి అని సత్యవాణి పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గిస్తూ పండుగలను ప్రకృతికి హాని కలగకుండా జరుపుకోవాలని సూచించారు. ప్రకృతిని కాపాడేందుకు మన జీవన విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.
“మనం మారితే.. లోకం మారుతుంది” అని ఆమె పేర్కొన్నారు. మనలో మార్పు మొదలైతేనే సమాజంలో, ఆ తర్వాత ప్రపంచంలో మార్పు వస్తుందని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాల్లో ప్రకృతిని గౌరవించే గొప్ప జీవన విధానం ఉందని తెలిపారు.
ప్రపంచం భారతీయ సంస్కృతి వైపు చూస్తోంది
ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారతదేశ సంస్కృతి, సంప్రదాయాల వైపు చూస్తోందని సత్యవాణి అన్నారు. భారతీయ సనాతన ధర్మంలోని విలువలు, కుటుంబ వ్యవస్థ, ప్రకృతితో మమేకమై జీవించే విధానం ప్రపంచానికి ఎంతో విలువైన సందేశాన్ని అందిస్తున్నాయని పేర్కొన్నారు. మన మూలాలను మరచిపోకుండా ఆ సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, సమాజంపై ఉందన్నారు.

*తల్లి పిల్లలకు తొలి గురువు*

తల్లి పిల్లలకు తొలి గురువు అని సత్యవాణి అన్నారు. పిల్లలు మంచి బుద్ధులు, సంస్కారం, విలువలు, నడవడికను ముందుగా తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారని తెలిపారు. చిన్నారులకు చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను పరిచయం చేయాలని సూచించారు.
సెల్‌ఫోన్‌ వినియోగాన్ని అవసరమైన మేరకే పరిమితం చేసుకోవాలని, మొబైల్‌ వినియోగం, రేడియేషన్‌ ప్రభావాలపై ప్రజలు అవగాహన పెంచుకోవాలని అన్నారు. పిల్లలను ఎప్పుడూ సెల్‌ఫోన్లకు పరిమితం చేయకుండా కుటుంబం, పుస్తకాలు, ప్రకృతి, సంస్కృతితో అనుసంధానం చేయాలని సూచించారు.
ఆధ్యాత్మిక, సామాజిక అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటివరకు దాదాపు 2 లక్షల మంది విద్యార్థులను కలుసుకుని సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలపై అవగాహన కల్పించినట్లు సత్యవాణి తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో మంచి మార్పు తీసుకురావాలని, ఆ మార్పే సమాజ మార్పుకు నాంది కావాలని పిలుపునిచ్చారు.
సత్యవాణి ప్రవచనాలను ఆలకించేందుకు ఓడీఎఫ్‌ కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.