జగిత్యాల స్టాప్ రిపోర్టర్, ఎండపల్లి సెప్టెంబర్ 14(ప్రజావాణి):
ఇటీవల ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన బిఆర్ఎస్ పార్టీ ఎండపల్లి మండల తాజా మాజీ అధ్యక్షుడు సింహాచలం జగన్ కుటుంబాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ శనివారం రోజున పరామర్శించారు. గుల్లకోట గ్రామంలోని జగన్ నివాసానికి చేరుకున్న మంత్రి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చి, పార్టీలకతీతంగా మానవతా దృక్పథంతో రూ. 50వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ… జగన్ భౌతికంగా మన మధ్య లేకపోవడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని, ఆయన భార్యకు ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. అలాగే, పిల్లల చదువు, ఇతర అవసరాలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని భరోసానిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ, మానవత్వంతో స్పందించి ఆర్థిక సాయం అందించడమే కాకుండా భవిష్యత్తుకు హామీ ఇచ్చిన మంత్రి లక్ష్మణ్‌పై గ్రామస్థులు ప్రశంసల వర్షం కురిపించారు.
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌పై గ్రామస్థుల ఆగ్రహం:
పార్టీ కోసం అప్పులు చేసి ఆత్మహత్య చేసుకున్న జగన్ కుటుంబాన్ని బిఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కనీసం ఎలాంటి ఆర్థిక సాయం, భరోసా ఇవ్వకపోవడం పట్ల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, జగన్ కుటుంబాన్ని ఆదుకునేందుకు స్థానిక ఆర్ఎంపీలు, సర్పంచ్‌లు, మాజీ ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు విరాళాలు (చందాలు) సేకరించి అందజేయనున్నట్లు తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్లపల్లి మల్లేష్ గౌడ్, ఎండపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గెల్లు శేఖర్, వెల్గటూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ ద్యావా మహిపాల్ రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు బిసగోని సత్యం, భూసరపు భూమయ్య, గొనె సంతోష్, సురేష్, వార్డు సభ్యులు పాలకుర్తి తిరుపతి, జంగిలి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

