📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్రోడ్డుపై గుంతల గండం అధ్వానంగా మారిన రోడ్డు

రోడ్డుపై గుంతల గండం అధ్వానంగా మారిన రోడ్డు

📰 Generate e-Paper Clip

స్టేషన్ రోడ్డుపై గుంతల గండం.. కారు ఇరుక్కొని భారీ ట్రాఫిక్ జామ్

రెండేళ్లుగా అధ్వానంగా మారిన రోడ్డు

గుంతల్లో పడి వాహనదారులకు తప్పని తిప్పలు

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు.. స్థానికుల ఆగ్రహం

మేడ్చల్: మేడ్చల్ పట్టణంలోని స్టేషన్ రోడ్డు గుంతలమయంగా మారడంతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ప్రమాదాలకు నిలయంగా మారుతున్నా సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నప్పటికీ రహదారి మరమ్మతుల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.సోమవారం స్టేషన్ రోడ్డుపై ఓ కారు వెళ్తుండగా ఒక్కసారిగా ముందరి టైరు భారీ గుంతలో పడిపోయింది. గుంత లోతుగా ఉండటంతో కారు అక్కడే ఇరుక్కుపోయి ముందుకు కదలలేదు. దీంతో రోడ్డుపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి కొద్దిసేపు భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. కారు ఇరుక్కుపోవడంతో వాహనదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారును గుంత నుంచి బయటకు తీసేందుకు సహాయం చేశారు.

ప్రమాదాలకు ఆహ్వానం

స్టేషన్ రోడ్డుపై ఏర్పడిన గుంతలు వాహనదారులకు తీవ్ర ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గుంతలను తప్పించుకునే క్రమంలో అదుపుతప్పే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. వర్షం కురిసిన సమయంలో గుంతల్లో నీరు నిలిచిపోవడంతో వాటి లోతు తెలియక వాహనదారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి వేళల్లో వీధి దీపాల వెలుతురు సరిగా లేకపోవడం లేదా గుంతలు స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు.

తాత్కాలిక చర్యలతో సమస్య పరిష్కారమా?

గుంతలు ఏర్పడిన ప్రాంతాల్లో అధికారులు సిమెంట్ ఇటుకలు, ఇతర సామగ్రితో తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టినప్పటికీ అవి ఎక్కువకాలం నిలవడం లేదని స్థానికులు చెబుతున్నారు. వాహనాల రాకపోకలు, వర్షాల కారణంగా మళ్లీ గుంతలు ఏర్పడి పరిస్థితి మొదటికి వస్తోందని అంటున్నారు. రోడ్డుకు శాశ్వత మరమ్మతులు చేపట్టి నాణ్యమైన రహదారిని నిర్మించాల్సిన అవసరం ఉందని వాహనదారులు కోరుతున్నారు.

ఫిర్యాదులు చేసినా ఫలితం లేదంటూ ఆవేదన

స్టేషన్ రోడ్డు దుస్థితిపై మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వచ్చి పరిస్థితిని పరిశీలించి వెళ్లడం తప్ప, గుంతలను పూర్తిగా తొలగించి రహదారిని బాగుచేసే చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు.గత రెండు సంవత్సరాలుగా రోడ్డు ఇదే పరిస్థితిలో ఉంది. చిన్నచిన్న మరమ్మతులతో సమస్య పరిష్కారం కాదు. ప్రతిరోజూ ఈ రోడ్డుపై ప్రయాణించే ప్రజల ఇబ్బందులను అధికారులు గుర్తించాలి” అని స్థానికులు పేర్కొన్నారు.

భారీ ప్రమాదం జరిగితేనే స్పందిస్తారా?

ఇప్పటికే పలుమార్లు వాహనాలు గుంతల్లో ఇరుక్కోవడం, వాహనదారులు ఇబ్బందులు పడటం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు. అయినప్పటికీ అధికారులు స్పందించకపోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

“ఏదైనా భారీ ప్రమాదం జరిగితే తప్ప అధికారులు కదలరా? ప్రాణ నష్టం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే ముందే సమస్యను పరిష్కరించాలి” అని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం కారు గుంతలో ఇరుక్కోవడంతో మరోసారి స్టేషన్ రోడ్డు దుస్థితి వెలుగులోకి వచ్చింది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్టేషన్ రోడ్డును పూర్తిగా పరిశీలించి, ప్రమాదకరమైన గుంతలను గుర్తించి శాశ్వతంగా పూడ్చాలని వాహనదారులు, స్థానికులు కోరుతున్నారు. రహదారిపై నాణ్యమైన మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షితమైన రాకపోకలు కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.