📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణHanumakondaప్రజలకు చేరువగా దామెర ఎస్సై వీరభద్రరావు

ప్రజలకు చేరువగా దామెర ఎస్సై వీరభద్రరావు

📰 Generate e-Paper Clip

ప్రజలకు చేరువగా దామెర ఎస్సై వీరభద్రరావు

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు.. వినాయక మండపాలపై అప్రమత్తత

ప్రజావాణి హనుమకొండ నవీన్ బ్యూరో
దామెర సెప్టెంబర్ 14: కొద్దిరోజుల క్రితమే దామెర పోలీస్‌స్టేషన్‌ ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన వీరభద్రరావు ప్రజలకు చేరువగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

మండలంలో నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు, షీ టీమ్‌ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో ఎస్సై వీరభద్రరావు పనితీరుపై మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వినాయక మండపాల ఏర్పాటులో జాగ్రత్తలు

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో మండపాల నిర్వాహకులు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని ఎస్సై వీరభద్రరావు సూచించారు. ముఖ్యంగా విద్యుత్‌ స్తంభాలు, విద్యుత్‌ తీగలకు సమీపంలో వినాయక మండపాలను ఏర్పాటు చేయవద్దని తెలిపారు. విద్యుత్‌ షాక్‌ కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ప్రతి మండపం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి

దామెర పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు సంబంధిత మండప వివరాలను తప్పనిసరిగా పోలీస్‌శాఖలో నమోదు చేసుకోవాలని ఎస్సై సూచించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో జారీ చేసిన భద్రతా నిబంధనలకు అనుగుణంగా మండపాల నిర్వాహకులు వ్యవహరించాలని కోరారు.

డీజేలకు అనుమతి లేదు

వినాయక ఉత్సవాల సందర్భంగా డీజేలు ఏర్పాటు చేసి అధిక శబ్దంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని ఎస్సై వీరభద్రరావు హెచ్చరించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ పరిధిలో డీజేల విషయంలో జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా దామెర మండలంలో కూడా నిబంధనలు కచ్చితంగా అమలు చేస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా డీజేలు ఏర్పాటు చేసినా, నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి

మండలంలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సూచించారు. వర్షాల సమయంలో ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్‌శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, మండపాల నిర్వాహకులు పోలీస్‌శాఖకు సహకరించాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.