📄 ePaper
Epaper 2
Tuesday, September 15, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయండి

వీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయండి

📰 Generate e-Paper Clip

వీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయండి

ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకట చంద్ర

గరిడేపల్లి, సెప్టెంబర్ 15 (ప్రజావాణి): తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను కాపాడుతూ, వీరవనితల పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించేందుకు నిర్వహిస్తున్న వీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు తంగేళ్ల వెంకట చంద్ర పిలుపునిచ్చారు.

మంగళవారం గరిడేపల్లి మండలం కీతవారిగూడెంలోని కామ్రేడ్ సుందరి బిక్షమయ్య భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10 నుంచి 17 వరకు రాష్ట్ర జాతా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఈ యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగిన గొప్ప ప్రజా ఉద్యమమని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రారంభమైన ఉద్యమం క్రమంగా భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా “దున్నేవాడికే భూమి” అనే నినాదంతో మహత్తర భూపోరాటంగా విస్తరించిందన్నారు.

ఈ పోరాటంలో సుమారు నాలుగు వేల మంది ప్రజలు ప్రాణత్యాగం చేశారని, వారి త్యాగాల ఫలితంగా సుమారు 10 లక్షల ఎకరాల భూమి పేదలకు పంచబడిందని తెలిపారు. ముఖ్యంగా ఈ పోరాటంలో మహిళల పాత్ర ఎంతో మహోన్నతమైనదని అన్నారు.

పురుషులతో సమానంగా మహిళలు కూడా అత్యంత ధైర్యసాహసాలతో పోరాటంలో పాల్గొన్నారని, కుటుంబ బాధ్యతలను మోస్తూనే ఉద్యమానికి అండగా నిలిచారని చెప్పారు. పలువురు మహిళలు దళాల్లో చేరి, కొరియర్లుగా పనిచేస్తూ ఉద్యమాన్ని ముందుకు నడిపించారని తెలిపారు.

చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి వీరవనితలతో పాటు వేలాది మంది మహిళలు తమ శ్రమను, త్యాగాన్ని తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి అందించారని వెంకట చంద్ర అన్నారు. నేటి తరానికి వారి పోరాట స్ఫూర్తి ఎంతో అవసరమని పేర్కొన్నారు.

సాధారణ మహిళగా ప్రారంభమైన చాకలి ఐలమ్మ పోరాటం తెలంగాణ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్ఫూర్తిగా నిలిచిందన్నారు. వీరవనితల పోరాట స్ఫూర్తితో నేటి తరం కూడా ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

“తెలంగాణ రైతాంగ పోరాట చరిత్రను కాపాడుదాం.. వీరవనితల పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందిద్దాం” అనే నినాదంతో సాగుతున్న వీర వనితల స్ఫూర్తి యాత్రను జయప్రదం చేయాలని ఆమె కోరారు.

ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా కమిటీ సభ్యురాలు సుందరి రమాదేవి, యానాల సుశీల, భూతం సరిత, ఎల్లావుల పిచ్చమ్మ, ఇనుకుర్తి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.