ఘట్కేసర్, సెప్టెంబర్ 13 (ప్రజావాణి): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలను పూజించాలని సీపీఐ ఘట్కేసర్ మండల కార్యదర్శి లొట్టి ఈశ్వర్, సీపీఐ సీనియర్ నాయకులు కల్లూరి జైచంద్ర పిలుపునిచ్చారు. పోచారం పరిధిలోని ఆర్జీకే కాలనీ, కేఎల్ మహేంద్రనగర్, వికలాంగుల కాలనీలో సీపీఐ ఆధ్వర్యంలో మట్టి వినాయకులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పర్యావరణాన్ని, ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి కూడా మనలను కాపాడుతుందని అన్నారు. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలు, రసాయన రంగుల వినియోగం వల్ల పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని పేర్కొన్నారు. ఇటువంటి విగ్రహాలను చెరువుల్లో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితమై, జలచరాలు మృత్యువాత పడే ప్రమాదం ఉందన్నారు. దీనివల్ల ప్రకృతితో పాటు మానవాళికి కూడా ముప్పు ఏర్పడుతుందని తెలిపారు.
వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయకులను తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించి, అనంతరం నిమజ్జనం చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి అంజి, సీపీఐ నాయకులు అన్వర్, శాఖ కార్యదర్శి శ్రీనివాస్, డి.యాదవ్, కే.వినోద్, నీ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

