*మేడ్చల్ ఆబ్కారీలో ‘మత్తు’ వసూళ్లు*
*లైసెన్సులు ఉన్నా లంచాల వేధింపులు.. బాధితుల ఆవేదన*
*మద్యం మత్తులో బెదిరింపులు.. బయటపడ్డ డొల్లతనం*
*సామాన్యుడికో చట్టం.. అధికారులకో న్యాయమా *
మేడ్చల్ నేడు న్యూస్(సెప్టెంబర్ 13)
మేడ్చల్ పరిధిలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. చట్టబద్ధంగా అన్ని అనుమతులు, లైసెన్సులు ఉన్నప్పటికీ కల్లు దుకాణాల వ్యాపారులను లక్ష్యంగా చేసుకుని కొందరు సిబ్బంది అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. ప్రతి నెలా కార్యాలయానికి ముడుపులు సమర్పిస్తున్నప్పటికీ, నిత్యం ఎవరో ఒకరు వచ్చి డబ్బుల కోసం వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. అసలు తాము ఎంతమందికి లంచాలు ఇచ్చుకోవాలో అర్థం కావడం లేదని, ఇవ్వకపోతే తప్పుడు కేసులు బనాయిస్తామని బెదిరింపులకు దిగుతున్నారని వ్యాపారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
**మద్యం మత్తులో బెదిరింపులు.. బయటపడ్డ డొల్లతనం *
గత మూడు నెలల క్రితం జరిగిన వీడియో స్థానికంగా బయటకు వచ్చింది. సాయంత్రం ఓ కల్లు దుకాణం వద్దకు వచ్చిన ఎక్సైజ్ సిబ్బంది మద్యం మత్తులో డబ్బులు ఇవ్వాలంటూ హంగామా సృష్టించారు. తాము ఇప్పటికే ప్రతి నెలా ఆఫీసుకు మామూళ్లు పంపుతున్నామని, మళ్లీ రోజూ ఎందుకు ఇవ్వాలని యజమాని నిలదీయడంతో వివాదం మొదలైంది. దీంతో ఆ సిబ్బంది వెంటనే కార్యాలయంలోని మరో వ్యక్తికి ఫోన్ చేసి ఇక్కడికి ఎవరెవరు వచ్చి డబ్బులు తీసుకుంటున్నారో తేల్చాలని వ్యాపారి ముందే అడిగారు. ఫోన్‌లో మాట్లాడిన సిబ్బంది వ్యాపారితో మాట్లాడుతూ, తమ సిబ్బంది అక్కడి దాకా వచ్చినందుకు ఎంతో కొంత ఇచ్చి పంపాలని, లేదంటే తాము చేయాల్సిన పని చేస్తామంటూ నిర్లజ్జగా హెచ్చరించడం అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. సిబ్బంది మధ్య సమన్వయం లేకుండా ఒకరి తర్వాత ఒకరు వసూళ్ల కోసం పోటీ పడుతున్న తీరు ఈ ఘటనతో బట్టబయలైంది.
సామాన్యుడికో చట్టం.. అధికారులకో న్యాయమా? :*
మద్యం తాగి వాహనాలు నడిపితే సామాన్య ప్రజలపై కఠిన చలానాలు విధిస్తూ కోర్టులకు పంపే చట్టాలు, డ్యూటీ సమయంలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ వసూళ్లకు పాల్పడుతున్న ఎక్సైజ్ సిబ్బందికి వర్తించవా అని స్థానికులు సూటిగా ప్రశ్నిస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి, చట్టాన్ని అమలు చేయాల్సిన వారే ఇలా మద్యం మత్తులో వ్యాపారులను ఇబ్బందులకు గురిచేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. మేడ్చల్ మండలవ్యాప్తంగా సాగుతున్న ఈ అక్రమ వసూళ్ల దందాపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, విధుల్లో మద్యం తాగి దౌర్జన్యాలకు పాల్పడుతున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు.

