📄 ePaper
ePaper2
Saturday, September 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఆంధ్రప్రదేశ్కామ్రేడ్ కుమార్ అన్న.. సీతారాముల త్యాగాలు స్ఫూర్తిదాయకం

కామ్రేడ్ కుమార్ అన్న.. సీతారాముల త్యాగాలు స్ఫూర్తిదాయకం

📰 Generate e-Paper Clip

కామ్రేడ్ కుమార్ అన్న.. సీతారాముల త్యాగాలు స్ఫూర్తిదాయకం

 

జనశక్తి సంఘ నాయకులు కోనేరు రమేష్

 

పలాస. ప్రజావాణి ప్రతినిధి

 

అమాయక గిరిజనులు, రైతులు, కూలీలు, పేద ప్రజల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన కామ్రేడ్ కుమార్ అన్న, కామ్రేడ్ సీతారాముల త్యాగాలు ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని జనశక్తి సంఘ నాయకులు కోనేరు రమేష్ అన్నారు. మందస మండలం కుసుమల పంచాయతీ బలయాగం గ్రామంలో గురువారం నిర్వహించిన వారి 28వ వర్ధంతి సందర్భంగా సంతాప సభ నిర్వహించి అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు.

 

ఈ సందర్భంగా కోనేరు రమేష్ మాట్లాడుతూ.. అమాయక గిరిజన ప్రజల భూమి, భుక్తి, విముక్తి కోసం నిస్వార్థంగా పోరాడిన ప్రముఖ నాయకుల్లో కామ్రేడ్ కుమార్ అన్నది ప్రత్యేక స్థానం అన్నారు. గిరిజన రైతాంగ పోరాటాలకు ఆయన నాయకత్వం వహించి, భూమిలేని గిరిజనులకు భూమి సాధించేందుకు ఉద్యమాలు నిర్వహించారని తెలిపారు.

 

కామ్రేడ్ కుమార్ అన్న నాయకత్వంలో మెలియాపుట్టి, టెక్కలి, నందిగాం, పలాస, మందస తదితర ప్రాంతాల్లో గిరిజన భూ పోరాటాలు జరిగాయని, ఆ పోరాటాల ద్వారా వేలాది ఎకరాల భూమిని సాధించి గిరిజన ప్రజలకు పంచిపెట్టిన చరిత్ర ఉందని కోనేరు రమేష్ పేర్కొన్నారు. నాటి పోరాటాల ఫలితంగా సాధించిన భూముల్లో నేటికీ అనేక మంది గిరిజనులు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారని అన్నారు.

గిరిజనులు తమ భూములు, జీవనాధారం, హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చిన కుమార్ అన్న ఆశయాలను నేటి తరం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. నేటికీ అనేక మంది గిరిజనులు భూమి, ఉపాధి, ఇళ్ల స్థలాలు, సాగు హక్కులు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

 

కామ్రేడ్ కుమార్ అన్న, కామ్రేడ్ సీతారాముల త్యాగాలను స్మరించుకుంటూ గిరిజనులు, రైతులు, కూలీలు, పేద ప్రజల హక్కుల కోసం పోరాడటమే వారికి అందించే నిజమైన నివాళి అని కోనేరు రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధాకర్, మాధవరావు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.