ఘాట్ కేసర్, ఆగస్టు 31 ( ప్రజా వాణి ) : ఘట్‌కేసర్ సర్కిల్ పోచారం డివిజన్ పరిధిలోని జోడిమెట్ల వద్ద అక్రమ నిర్మాణాల జోరు నిరాటంకంగా కొనసాగుతోంది. జాతీయ రహదారి పక్కనే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా భారీ కమర్షియల్ షెడ్ల నిర్మాణాలు వెలుస్తున్నా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం కన్నెత్తి చూడకపోవడంపై స్థానికంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
హైవే నిబంధనలు గాలికి..
నేషనల్ హైవే నిబంధనల ప్రకారం రహదారికి నిర్దిష్ట దూరంలో మాత్రమే, ముందస్తు అనుమతులతో నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుంది. అయితే జోడిమెట్లలో ఈ నిబంధనలను తుంగలో తొక్కుతూ రాత్రికి రాత్రే పనులు పూర్తి చేస్తున్నారు. ఇంత బహిరంగంగా నిర్మాణాలు సాగుతున్నా అధికారులు కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా ముందుకు రాకపోవడం వెనుక భారీగా ముడుపులు చేతులు మారాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
చైన్ మెన్ల చేతుల్లోనే మున్సిపాలిటీ చక్రం?
ఈ అక్రమ వ్యవహారంలో మున్సిపల్ సర్కిల్‌కు చెందిన కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది (చైన్‌మెన్లు) కీలకంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులకు, నిర్మాణదారులకు మధ్య వీరే మధ్యవర్తులుగా ఉండి మామూళ్ల సర్దుబాటు చేస్తున్నారనే గుసగుసలు మున్సిపల్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు కార్యాలయాలకే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో అక్రమార్కులదే రాజ్యంగా మారింది.
సామాన్యుడికో న్యాయం.. బడా బాబులకో న్యాయమా?
సామాన్యులు సొంత స్థలంలో చిన్న రేకుల షెడ్డు వేసుకున్నా ప్లాన్ అప్రూవల్స్, నోటీసుల పేరుతో వేధించే అధికారులు.. హైవే పక్కన లక్షల రూపాయల విలువైన వాణిజ్య షెడ్లు వెలుస్తుంటే ఎందుకు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు నిలదీస్తున్నారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల ప్లాన్ అప్రూవల్ ఫీజులు, డెవలప్‌మెంట్ ఛార్జీలు రాక మున్సిపాలిటీ ఖజానాకు భారీగా గండి పడుతోంది.
ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అక్రమ నిర్మాణాలను తక్షణమే కూల్చివేయాలని, ఇందుకు సహకరించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

