ఘట్కేసర్, ఆగస్టు 28 (ప్రజావాణి): ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 25 క్వింటాళ్ల ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 9 వద్ద విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు తనిఖీలు నిర్వహించగా, టీజీ30టీ5841 నంబర్ గల వాహనంలో బియ్యాన్ని తరలిస్తున్న ధెరవత్ శ్రీను (40)ను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసుల విచారణలో రేషన్ కార్డుదారుల నుంచి కిలో బియ్యాన్ని రూ.16 చొప్పున కొనుగోలు చేసి, అనంతరం మరో వ్యక్తికి కిలోకు రూ.20 చొప్పున విక్రయిస్తున్నట్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు అందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.
ఈ వ్యవహారంలో శంషాబాద్‌కు చెందిన శ్రీకాంత్ మరో నిందితుడిగా ఉన్నట్లు, ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి సుమారు 25 క్వింటాళ్ల రేషన్ బియ్యం, ఒక వాహనం, మొబైల్ ఫోన్, రూ.7 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.


