పోచారం, ఆగస్టు 28 (ప్రజావాణి): పోచారం డివిజన్ పరిధిలో అధ్వానంగా మారిన రోడ్లు, డ్రైనేజీ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కర్ర రాజేష్ కోరారు. ఈ మేరకు ఘట్కేసర్ సర్కిల్ డీసీ వాణిని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
డివిజన్ పరిధిలోని కాచవాని సింగారం, కొర్రెముల, బాలాజీనగర్, చౌదరిగూడ సాయిబాబానగర్ కాలనీ, ఇస్మాయిల్ఖాన్, యన్నంపేట్, ఆర్.జీ.కే. యన్నంపేట్, ప్రతాప్‌సింగారం తదితర ప్రాంతాల్లో నెలకొన్న రోడ్లు, డ్రైనేజీ సమస్యలను డీసీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రాంతాలను గుర్తించి తక్షణమే రోడ్డు మరమ్మతులు, డ్రైనేజీ పనులు చేపట్టాలని కోరారు.
ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా డివిజన్లో అవసరమైన ప్రాంతాలను గుర్తించి అధికారులతో సమన్వయం చేస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని కర్ర రాజేష్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో పోచారం మాజీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఘట్కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపాల వినోద్ కుమార్ పాల్గొన్నారు.

