ఘట్‌కేసర్, ఆగస్టు 28 (ప్రజా వాణి): అన్నోజిగూడ పరిధిలోని సర్వే నంబర్ 93లో నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసిన విద్యుత్ కనెక్షన్‌ను వెంటనే తొలగించాలని బాలగౌని బాలరాజ్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈ నెల 23న నారపల్లి విద్యుత్ శాఖ సహాయ ఇంజినీర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసి, భూమికి సంబంధించిన పత్రాలను అందజేసినట్లు తెలిపారు.
సర్వే నంబర్ 93లోని భూమికి సంబంధించి అసలు పట్టాదారు ఉస్కె నర్సింహారెడ్డి నుంచి తాను చట్టబద్ధంగా సాధారణ అధికార పత్రం, విక్రయ పత్రం ద్వారా హక్కులు పొందినట్లు బాలగౌని బాలరాజ్ గౌడ్ తెలిపారు. తన వద్ద భూమికి సంబంధించిన పూర్తి పత్రాలు ఉన్నప్పటికీ, బోయినపల్లి మల్లారెడ్డి కుటుంబ సభ్యులకు విద్యుత్ కనెక్షన్ ఎలా మంజూరు చేశారని ఆయన ప్రశ్నించారు.
నిబంధనలకు విరుద్ధంగా మంజూరైన విద్యుత్ కనెక్షన్‌పై విద్యుత్ శాఖ అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, వెంటనే తొలగించాలని కోరారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం జరిగే వరకు చట్టపరంగా పోరాటం కొనసాగిస్తానని బాలగౌని బాలరాజ్ గౌడ్ స్పష్టం చేశారు.

