జిల్లా కేంద్రంలో ఎస్సీ విద్యార్థులకు కళాశాల హాస్టల్ మంజూరు చేయాలిములుగు జిల్లాకు సీఎం రాకను స్వాగతిస్తున్నాం
– ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి
ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి)
ములుగు: ములుగు జిల్లాకు ముఖ్యమంత్రి రాకను స్వాగతిస్తున్నామని, జిల్లా పర్యటన సందర్భంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి కోరారు.
ఈ సందర్భంగా టి.ఎల్. రవి మాట్లాడుతూ ములుగు జిల్లాలో విద్యార్థులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. జిల్లాలో ఉన్నత విద్యకు సంబంధించిన విద్యాసంస్థలు తగిన స్థాయిలో లేకపోవడంతో విద్యార్థులు పై చదువుల కోసం హనుమకొండ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం ఆర్థికంగా భారంగా మారుతోందన్నారు.
జిల్లాలో బీఈడీ కళాశాల ఏర్పాటు చేయాలి
ములుగు జిల్లాలో ప్రభుత్వ బీఈడీ కళాశాలను ఏర్పాటు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తోందన్నారు. జిల్లాలోనే బీఈడీ విద్య అందుబాటులో ఉంటే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఉన్నత విద్య కోసం విద్యార్థులు ఇతర జిల్లాలకు వెళ్లే పరిస్థితిని నివారించేందుకు ప్రభుత్వం తక్షణమే బీఈడీ కళాశాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఎస్సీ విద్యార్థులకు కళాశాల హాస్టల్ మంజూరు చేయాలి
ములుగు జిల్లా కేంద్రంలో ఎస్సీ విద్యార్థులకు ప్రత్యేక కళాశాల హాస్టల్ మంజూరు చేయాలని గతంలోనే అధికారులకు అనేకసార్లు వినతులు సమర్పించినట్లు టి.ఎల్. రవి తెలిపారు. అయినప్పటికీ ఇప్పటివరకు సమస్య పరిష్కారం కాలేదన్నారు.
హాస్టల్ సౌకర్యం లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేని విద్యార్థులు ప్రైవేట్ వసతి గృహాల్లో ఉండలేక చదువులను మధ్యలోనే నిలిపివేసే పరిస్థితి ఏర్పడకుండా ప్రభుత్వం వెంటనే ఎస్సీ కళాశాల హాస్టల్ మంజూరు చేసి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలి
జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు అవసరమైన కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి టి.ఎల్. రవి కోరారు. నాణ్యమైన భోజనం, స్వచ్ఛమైన తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్, సరైన వసతి, పరిశుభ్రత వంటి సదుపాయాలను కల్పించడంతో పాటు హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అన్నారు.
ముఖ్యమంత్రి ములుగు జిల్లా పర్యటన సందర్భంగా విద్యార్థుల సమస్యలను పరిశీలించి, బీఈడీ కళాశాల ఏర్పాటు, ఎస్సీ విద్యార్థులకు కళాశాల హాస్టల్ మంజూరు, సంక్షేమ హాస్టళ్లలో కనీస మౌలిక సదుపాయాల కల్పన వంటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ తరఫున విజ్ఞప్తి చేస్తున్నామని టి.ఎల్. రవి తెలిపారు.
ఈసారైనా ముఖ్యమంత్రి ములుగు జిల్లా పర్యటనలో ఎస్సీ విద్యార్థుల కళాశాల హాస్టల్‌కు మంజూరు ఉత్తర్వులు జారీ చేసి, బీఈడీ కళాశాల ఏర్పాటుకు చేపట్టాలని కోరారు.

