📄 ePaper
Epaper 2
Wednesday, September 16, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriఅవయవదానంపై చైతన్యం కల్పించాలి.. సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి

అవయవదానంపై చైతన్యం కల్పించాలి.. సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి

📰 Generate e-Paper Clip

అన్నోజిగూడ, ఆగస్టు 13(ప్రజా వాణి): అవయవదానం, నేత్రదానం, శరీరదానం, రక్తదానంపై ప్రజల్లో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని టీం రేవంత్ యువసేన రాష్ట్ర సభ్యులు సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రిటైర్డ్‌ పారామెడికల్‌ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా సింగిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మనిషి మరణించిన తర్వాత కూడా తన అవయవాలతో ఇతరుల జీవితాల్లో వెలుగులు నింపే అవకాశం ఉందన్నారు. అవయవదానం ద్వారా ప్రాణాపాయంలో ఉన్న ఎంతోమందికి పునర్జన్మ కల్పించవచ్చని, నేత్రదానం ద్వారా చూపులేని వారికి కంటి వెలుగు అందించవచ్చని తెలిపారు. శరీరదానం ద్వారా వైద్య విద్యార్థులకు మానవ శరీర నిర్మాణంపై విలువైన జ్ఞానం అందుతుందని పేర్కొన్నారు.

వారు మాట్లాడుతూ రక్తదానం కూడా ఎంతో గొప్ప సేవ అని, పద్దెనిమిదేళ్లు నిండిన ఆరోగ్యవంతులు వీలైన సందర్భాల్లో రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువతలో అవయవదానం, రక్తదానం పట్ల అవగాహన పెంచేందుకు మరిన్ని చైతన్య కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు.

సమాజం నుంచి ఎంతో పొందుతున్న మనం.. తిరిగి సమాజానికి ఏమిస్తున్నామనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలని శ్రీకాంత్‌రెడ్డి సూచించారు. మనం జీవించి ఉన్నప్పుడు సేవ చేయడమే కాకుండా, మరణించిన తర్వాత కూడా ఇతరులకు ఉపయోగపడేలా అవయవాలు, నేత్రాలు, శరీరాన్ని దానం చేయడం ద్వారా మానవత్వాన్ని చాటుకోవచ్చన్నారు.

గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, పాఠశాలలు, కళాశాలల్లో అవయవదానం, నేత్రదానం, రక్తదానంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రిటైర్డ్‌ పారామెడికల్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు పి. నరసింహాచారి, ప్రధాన కార్యదర్శి ఆర్. సద్గుణచారి, నిర్వహణ కార్యదర్శి బి. గురుప్రకాష్‌, ఎం. విజయ్‌కుమార్‌, టీ. ప్రతాప్‌రెడ్డి జీహెచ్‌ఎం. ఏ. రాందాస్‌, పి. బాషయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.