ఘట్కేసర్, ఆగస్టు 09: ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎదులాబాద్ 7వ డివిజన్ గణపురం గ్రామంలో బోనాల పండుగను ఈ నెల 23న ఘనంగా నిర్వహించాలని గ్రామ పెద్దలు, నిర్వాహకులు నిర్ణయించారు. ఈ మేరకు గ్రామంలో నిర్వహించిన సమావేశంలో పండుగ ఏర్పాట్లు, కార్యక్రమాలపై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ డీసీసీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. గ్రామ ప్రజలంతా ఐకమత్యంతో పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.
బోనాల పండుగను పురస్కరించుకుని గ్రామంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. పండుగ రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు, యువత, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

