ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మౌనం వెనుక ఆంతర్యమేమిటి?
రామగుండంలో అక్రమ నిర్మాణాలపై బహిరంగ చర్చకు సవాల్
సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య ఆగ్రహం
గోదావరిఖని ఆగస్టు9 ప్రజావాణి :
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీనగర్ కాంప్లెక్స్ కూల్చివేతల వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారింది. రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే మున్సిపల్ అధికారులు, సింగరేణి యాజమాన్యం కుమ్మక్కై పేదల దుకాణాలను ధ్వంసం చేశాయని సిపిఐ ఫ్లోర్ లీడర్ మార్కపురి సూర్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్థానిక ఎమ్మెల్యే హామీతోనే బాధితులు దుకాణాలు నిర్మించుకున్నారని, ఇప్పుడు అధికారులు దాడి చేస్తుంటే ఎమ్మెల్యే మౌనం దాల్చడం వెనుక ఉన్న ఆంతర్యమేమిటని ఆయన ప్రశ్నించారు. బాధితుల వివరాలతో కూడిన ఫ్లెక్సీలను సంఘటనా స్థలంలో ప్రదర్శించి, విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
అసలు అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే..
కార్పొరేషన్ పరిధిలో వెలుగుచూస్తున్న బడా నాయకుల అవినీతిని, తిలక్ నగర్ సెంటర్లో నిర్మిస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రతిపక్షాలపై బురదజల్లుతున్నారని సూర్య విమర్శించారు. తిలక్ నగర్ కాంప్లెక్స్‌లో 16 షాపులకు గానూ నిబంధనలకు విరుద్ధంగా 24 షాపులు నిర్మిస్తున్నారని, స్థానిక కార్పొరేటర్ ఆరోపించినా పాలకులు స్పందించకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. తిలక్ నగర్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాల్లో స్థానిక కార్పొరేటర్, కార్పొరేషన్ అధ్యక్షుడికి ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టమైన ప్రకటన చేయగలరా అని సవాల్ విసిరారు.
నిజాలు కాకపోతే ముక్కు నేలకు రాస్తా!
ఓల్డ్ అశోక్ థియేటర్ వద్ద వేసిన తాత్కాలిక నిర్మాణాల్లో అదనపు దుకాణాలు లేవని, అలాగే రాజేష్ థియేటర్ వద్ద కాంగ్రెస్ నాయకుల మధ్య జరిగిన సెటిల్మెంట్లు నిజం కాదని నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సూర్య విలేకరుల సమక్షంలో సవాల్ చేశారు. ఒకవేళ ఇవన్నీ నిజమైతే అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పరిధిలో నిర్మాణాలు జరుగుతున్న ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర పూర్తి వివరాలతో కూడిన బోర్డులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తాం..
ఎల్బీనగర్ కాంప్లెక్స్ బాధితుల్లో ఏ ఒక్కరికి అన్యాయం జరిగిన చూస్తూ ఊరుకోమని, బాధితులకు దుకాణాలు కేటాయించకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు నిరసనకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులు పూసాల శంకర్, సోడాల కనకమ్మ, ఎజ్జు రమేష్, ఇమ్రాన్ సారు, ఎస్కే గౌస్, కొత్తపల్లి రాయమల్లోలతో పాటు సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, నగర కార్యదర్శి కే. కనకరాజ్, కార్యవర్గ సభ్యులు శనిగరపు చంద్రశేఖర్, రేణిగుంట్ల ప్రీతం, నాయకులు రాణవేణి సుధీర్, సాధుల శివ, పోతరాజు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

