📄 ePaper
Saturday, August 8, 2026
📄 ePaper
HomeతెలంగాణKhammamప్రజాదర్బార్‌తో వెలుగులోకి వెలుతురు భద్రమ్మ భూవివాదం…!

ప్రజాదర్బార్‌తో వెలుగులోకి వెలుతురు భద్రమ్మ భూవివాదం…!

📰 Generate e-Paper Clip

ప్రజాదర్బార్‌తో వెలుగులోకి వెలుతురు భద్రమ్మ భూవివాదం…!

– పొంగులేటి ప్రజాదర్బార్‌లో ఫిర్యాదుతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం

– 309, 310 సర్వే నంబర్లలో క్షేత్రస్థాయి పరిశీలన

ఖమ్మం బ్యూరో ప్రతినిధి మన ప్రజావాణి

రెవిన్యూ శాఖ, గృహ నిర్మాణ, సమాచార మంత్రి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాదర్బార్‌లో అందిన ఫిర్యాదుతో వెలుతురు భద్రమ్మ భూవివాదం మరోసారి తెరపైకి వచ్చింది. మే 5న మంగళగూడెం గ్రామంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో గోళ్లపాడు గ్రామానికి చెందిన వెలుతురు భద్రమ్మ తన భూమికి సంబంధించిన పత్రాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఫిర్యాదులోని అంశాలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయి విచారణకు శ్రీకారం చుట్టారు. తహసీల్దార్‌ విజయేంద్రరెడ్డి ఆదేశాల మేరకు ఖమ్మం రూరల్‌ సర్వేయర్‌ వినోద్‌కుమార్‌ శుక్రవారం గోళ్లపాడు గ్రామంలోని 309, 310 సర్వే నంబర్ల వద్దకు వెళ్లి భూమిని పరిశీలించారు. రికార్డుల్లోని వివరాలు, భూమి సరిహద్దులు, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులను పరిశీలించినట్లు సమాచారం.

*పాత పత్రాల పరిశీలన*

క్షేత్రస్థాయి పరిశీలనలో భాగంగా వెలుతురు భద్రమ్మ వద్ద ఉన్న వారసత్వ పత్రాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, భూ హక్కులకు సంబంధించిన ఇతర డాక్యుమెంట్లను అధికారులు పరిశీలించినట్లు తెలిసింది. అలాగే లంజపల్లి కోటయ్య కుటుంబానికి సంబంధించిన వారసత్వ వివరాలు, 1965లో జరిగిన భూ కొనుగోలుకు సంబంధించిన పత్రాలు, భద్రమ్మ భర్త చిన్న వెంకయ్య కొనుగోలు చేసిన భూమికి సంబంధించిన ఆధారాలను కూడా పరిశీలించినట్లు సమాచారం. సర్వే సమయంలో లంజపల్లి కుటుంబానికి చెందిన పలువురు అక్కడికి హాజరై తమ వద్ద ఉన్న పత్రాలు, వివరాలను అధికారులకు అందించినట్లు తెలిసింది.

*కుటుంబ సభ్యుల నుంచి వివరాల సేకరణ*

భూవివాదానికి సంబంధం ఉన్న లంజపల్లి కుటుంబ సభ్యులు, పెద్దలను అధికారులు పిలిపించి వారి వద్ద ఉన్న పాత పత్రాలు, భూమి హక్కులకు సంబంధించిన ఆధారాలను పరిశీలించినట్లు సమాచారం. దీంతో ఇంతకాలంగా కుటుంబాల మధ్య కొనసాగుతున్న భూవివాదంపై రెవెన్యూ అధికారులు నేరుగా క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.. గతంలో ప్రజాదర్బార్‌లో భద్రమ్మ చేసిన ఫిర్యాదుతో పాటు, అనంతరం సోషల్‌ మీడియాలో వెలువడిన వీడియోలు, అందులో వ్యక్తమైన ఆరోపణలపైనా అధికారులు వాస్తవ పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.

*భద్రమ్మ వారసత్వ హక్కులపై చర్చ*

చిన్న వెంకయ్యకు సంబంధించిన భూమి విషయంలో భార్యగా భద్రమ్మకు ఉన్న హక్కులు, వారసత్వ పరిస్థితులు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. కుమారుడు వెలుతురు గురవయ్య ద్వారా భూమి విక్రయమై ఉంటే, ఆ లావాదేవీలో భద్రమ్మకు ఉన్న హక్కులు ఏమిటన్నది కూడా పరిశీలించాల్సిన అంశంగా మారింది. అయితే ఈ అంశాలపై తుది నిర్ణయం కేవలం కుటుంబ సంబంధాల తన సతీమణి కమలమ్మ ఆధారంగా కాకుండా భూమి స్వభావం, పాత రిజిస్ట్రేషన్‌ పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులు, వారసత్వ ఆధారాలు, అప్పటి చట్టపరమైన నిబంధనలను పరిశీలించిన అనంతరమే తేలాల్సి ఉంది.

*అసలు భూమి ఎక్కడుంది?*

వివాదంలో ప్రధానంగా అసలు భూమి క్షేత్రస్థాయిలో ఉందా? రికార్డుల్లో నమోదైన విస్తీర్ణం, ప్రస్తుతం ఉన్న భూమి విస్తీర్ణం సరిపోతున్నాయా? భద్రమ్మ వద్ద ఉన్న పత్రాలకు అనుగుణంగా భూమి సరిహద్దులు ఉన్నాయా? అనే అంశాలు కీలకంగా మారాయి. అలాగే ఎస్సీ వర్గానికి చెందిన భూముల కొనుగోలు, విక్రయాలకు సంబంధించిన ఆరోపణలు, భూమిని పలువురికి పంచినట్లు చూపించారనే ఆరోపణలు తదితర అంశాలు కూడా వివాదంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. అయితే వీటిలో వాస్తవాలు ఏమిటన్నది అధికారిక రికార్డులు, రెవెన్యూ విచారణ, సర్వే నివేదిక ఆధారంగానే తేలాల్సి ఉంది.

*చిన్న వెంకయ్య నుంచి భూమి ఎవరి చేతుల్లోకి?*

భూవివాదంలో మరో కీలక అంశం చిన్న వెంకయ్య కొనుగోలు చేసిన భూమి అనంతరం ఎవరెవరి పేర్లకు మారిందన్నదే. చిన్న వెంకయ్య నుంచి తదుపరి ఎవరి పేరున రిజిస్ట్రేషన్‌ జరిగింది? ఆ తర్వాత ఎవరికి విక్రయించారు? ప్రస్తుతం రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ రికార్డుల్లో భూమి ఎవరి పేరున ఉంది? అనే వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
పాత రిజిస్ట్రేషన్‌ పత్రాలు, లింక్‌ డాక్యుమెంట్లు, రెవెన్యూ రికార్డులను పరిశీలిస్తే భూమి కొనుగోలు నుంచి ప్రస్తుత హక్కుదారు వరకు జరిగిన లావాదేవీల క్రమంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

*సర్వే నివేదికపై ఆసక్తి*

మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన ప్రజాదర్బార్‌లో భద్రమ్మ సమర్పించిన ఫిర్యాదుపై రెవెన్యూ అధికారులు స్పందించి 309, 310 సర్వే నంబర్లలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు సర్వే అనంతరం అధికారులు సమర్పించే నివేదికపై ఆసక్తి నెలకొంది. భూమి హక్కులు, సరిహద్దులు, విస్తీర్ణం, రికార్డులు, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, వారసత్వ ఆధారాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై నివేదికలో ఏం తేలుతుందన్నది. ఉత్కంఠగా మారింది. సమగ్ర విచారణ, రికార్డుల పరిశీలన, సర్వే నివేదిక అనంతరమే భూవివాదంపై పూర్తి స్పష్టత వెలుతురు భద్రమ్మకే న్యాయం జరిగే అవకాశం ఉన్నట్లు తెలు స్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular