అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలి!
మహిళా భద్రత,గంజాయి,డ్రగ్స్ నిర్మూలన,రోడ్డు భద్రతకు అత్యధిక ప్రాధాన్యత!
పోలీస్ సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశంలో పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్ దిశా నిర్దేశం!
కడప జూన్ 15 ప్రజావాణి) రౌడీ షీటర్లు నేర ప్రవృత్తి మానుకోకపోతే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ట్రబుల్ మాంగర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారి కదలికలపై నిరంతరం ప్రత్యేక నిఘా ఉంచాలని మట్కా, క్రికెట్ బెట్టింగ్,గ్యాంబ్లింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా కఠిన చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్.పి శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్,పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్-డివిజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ గ్రామ సభలు,పల్లె నిద్ర,గ్రామాల సందర్శన తప్పనిసరిగా నిర్వహించాలని ఆదేశించారు.అసాంఘిక కార్యకలాపాలైన మట్కా, క్రికెట్ బెట్టింగ్,గ్యాంబ్లింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.భూ వివాదాలు, ఆర్ధిక పరమైన అంశాల వలన క్రిమినల్ కేసులు నమోదైన ఎడల వాటిని క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల మరియు లీగల్ ప్రొసీజర్ మేరకు కేసు విచారణ త్వరితగతిన నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాలన్నారు.ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.డ్రోన్ కెమెరాల ద్వారా గంజాయి,ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.’శక్తి’ టీముల డే బీట్స్ పర్యవేక్షిస్తూ స్కూళ్ళు,కాలేజీలు,ఆఫీస్ లు,వ్యాపార సముదాయాల వద్ద,రద్దీ ప్రాంతాలలో తప్పనిసరిగా పోలీస్ సిబ్బంది బీట్లు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్.పి గారు ఆదేశించారు. స్కూళ్ళు, కాలేజీలలో ‘మహిళా భద్రత’పై, సోషల్ మీడియా వల్ల కలిగే మహిళలు, బాలికల వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు.
దొంగతనాల నేర చరిత్ర కలిగిన వారి కదలికలపై నిఘా ఉంచాలని,వివిధ రకాలైన,వివిధ ప్రాంతాలలో జరిగే దొంగతనాలను మ్యాపింగ్ చేసి సదరు ప్రాంతాలలో గస్తీ ముమ్మరం చేయాలన్నారు.గ్యాంబ్లింగ్ మట్కా,క్రికెట్ బెట్టింగ్ జరగకుండా కఠినంగా వ్యవహరించాలని,దాడులు ఉధృతం చేయాలని ఆదేశించారు.ఏ.పి పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ మేరకు షాపులు,లాడ్జిలు,హోటళ్లు,వాణిజ్య సముదాయాలు,అపార్ట్ మెంట్లు తదితర జన సమ్మర్థమైన ప్రదేశాల్లో తప్పనిసరిగా సి.సి కెమెరాలు అమర్చుకుని,వాటి పనితీరుపై శ్రద్ద వహించేలా నిర్వాహకులకు అవగాహన కల్పించాలని జిల్లా ఎస్.పి ఆదేశించారు.వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలపై,హెల్మెట్ ధరించేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.రోడ్డు ప్రమాదాలు జరిగేందుకు కారణాన్ని గుర్తించి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు డ్రంకెన్ డ్రైవ్,ఓవర్ స్పీడ్ లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలన్నారు.వాహనాల రికార్డులు తనిఖీ చేసి నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలన్నారు.సమావేశంలో కడప ఇంచార్జి డి.ఎస్.పి శ్రీ ఇ.బాలస్వామి రెడ్డి,సబ్ డివిజన్ లోని సి.ఐ లు ఎస్.ఐ లు పాల్గొన్నారు.

