దుకాణదారులకు నేరేడుచర్ల పోలీసుల హెచ్చరికలు – పాఠశాల పరిసరాల్లో ప్రత్యేక తనిఖీలు
నేరేడుచర్ల, ప్రజావాణి జూన్ 10: త్వరలో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థులను మత్తు పదార్థాల బారిన పడకుండా కాపాడేందుకు నేరేడుచర్ల పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ ఆదేశాల మేరకు మంగళవారం నేరేడుచర్ల మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లోని పాఠశాలల పరిసర ప్రాంతాల్లో ఉన్న దుకాణాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దుకాణదారులకు అవగాహన కల్పించిన పోలీసులు, పాఠశాలల సమీప ప్రాంతాల్లో పొగాకు సంబంధిత ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు తదితర మత్తు పదార్థాలను విక్రయించవద్దని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులకు ఎలాంటి మత్తు పదార్థాలు అమ్మరాదని స్పష్టం చేశారు.
నిబంధనలను ఉల్లంఘించి విద్యార్థులకు మత్తు పదార్థాలు
విక్రయించినట్లు గుర్తించినట్లయితే సంబంధిత దుకాణదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థుల ఆరోగ్యం, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు కోరారు.
ఈ తనిఖీల్లో భాగంగా పాఠశాలల పరిసర ప్రాంతాల్లోని దుకాణాల నిర్వాహకులకు “విద్యార్థులకు మత్తు పదార్థాలు విక్రయించవద్దు” అనే సందేశాన్ని స్పష్టంగా తెలియజేసినట్లు నేరేడుచర్ల ఎస్ఐ తెలిపారు. విద్యార్థులను మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉంచేందుకు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, దుకాణదారులు కలిసి పనిచేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

