📄 ePaper
Monday, June 8, 2026
📄 ePaper
HomeతెలంగాణMedchal-Malkajgiriకార్మికులను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి: భవన నిర్మాణ కార్మికుల డిమాండ్

కార్మికులను దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలి: భవన నిర్మాణ కార్మికుల డిమాండ్

📰 Generate e-Paper Clip

ఘట్కేసర్, జూన్ 8 (ప్రజావాణి): తమను అవమానకరంగా దూషించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలంలోని పోచారం పరిధి రాజీవ్ గృహకల్ప కాలనీలో సోమవారం భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు.

నిర్మాణ రంగంలో శ్రమిస్తున్న కార్మికులను కొందరు సెంట్రింగ్ కార్మిక సంఘాల ప్రతినిధులు “దళారీలు, మోసగాళ్లు” అంటూ చేసిన వ్యాఖ్యలపై కార్మికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రక్తాన్ని చెమటగా మార్చి కుటుంబాలను పోషించుకునే కార్మికుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడటం అన్యాయమని వారు పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రాజీవ్ గృహకల్ప కాలనీ భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీల సంఘం అధ్యక్షుడు తిరుమలయ్య మాట్లాడుతూ, రాత్రింబవళ్లు కష్టపడి భవనాలను నిర్మించే కార్మికులను నోటికొచ్చినట్లు దూషించడం బాధాకరమని అన్నారు. తమను అవమానించిన వారు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన కార్యక్రమం కేవలం కాలనీ స్థాయికే పరిమితం కాదని, రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తున్న మహా ధర్నాకు మద్దతుగా చేపట్టిన ఉద్యమంలో భాగమని నాయకులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాల సూచనల మేరకు న్యాయం జరిగే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

కార్మికులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అవసరమైతే నిర్మాణ పనులను బంద్ చేసి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మికులు, మేస్త్రీల సంఘం ఉపాధ్యక్షుడు కీల భాస్కర్, ప్రధాన కార్యదర్శి మద్దూరి శ్రీను, కోశాధికారి ఈ. ఉపేందర్, ప్రచార కార్యదర్శి ఎం. శేఖర్, కమిటీ సలహాదారులు ఎస్.కె. ఆలీ భాయ్, సైదులు, డి.వి. కృష్ణతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు, మేస్త్రీలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular