ఘట్కేసర్ జూన్ 6: ఘట్కేసర్ మండలంలోని అన్నోజిగూడ ఆర్జీకే కాలనీకి చెందిన ఓ మహిళ అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం, ఆర్జీకే కాలనీ నివాసి నడింపల్లి సురేష్ వర్మ (44) తన భార్య నాగేశ్వరి (36) కనిపించడం లేదంటూ జూన్ 5న పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదు మేరకు, సురేష్ వర్మకు 2008లో నాగేశ్వరితో వివాహం కాగా వారికి ఒక కుమారుడు ఉన్నాడు. నాగేశ్వరి గత రెండేళ్లుగా అన్నోజిగూడలోని ట్యులిప్స్ హోటల్లో హౌస్‌కీపింగ్ ఉద్యోగం చేస్తూ, నెల రోజుల క్రితం ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇంటి వద్దే ఉంటోంది.
జూన్ 2వ తేదీ ఉదయం సురేష్ వర్మ తన పనికి వెళ్లగా, మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో నాగేశ్వరి ఉద్యోగ ఇంటర్వ్యూకు వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి ఒక బ్యాగ్ తీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఆమెకు ఫోన్ చేయగా మొబైల్ స్విచ్ ఆఫ్‌లో ఉన్నట్లు గుర్తించాడు.
అప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల వద్ద గాలించినప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.



