📄 ePaper
Saturday, May 16, 2026
📄 ePaper
HomeతెలంగాణMancherialజిల్లాలో యదేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు

జిల్లాలో యదేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు

📰 Generate e-Paper Clip

*జిల్లాలో యదేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు*

*పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు*

*రెచ్చిపోతున్న మట్టి, ఇసుక మాఫియా*
మంచిర్యాల,( మన ప్రజావాణి) మే 16


జిల్లాలో మట్టి, ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. పంట భూములను చదును చేస్తున్నామని కొందరు దర్జాగా మట్టి దందాను కొనసాగిస్తున్నారు. జిల్లాలో మట్టి మాఫియా ఈ అక్రమ తవ్వకాలు జోరుగా చేపడుతున్నారు. పంట భూముల్లో చదును చేస్తున్నామని చెప్పి కొందరు గుట్టుగా మట్టి దందా సాగిస్తున్నారు. భూమిని విచ్చలవిడిగా యంత్రాలతో తోడేస్తున్నారు. రైతుల మాటున ప్రభుత్వం నుండి అనుమతులు పొంది, ఇష్టానుసారంగా మట్టిని తరలించి, సొమ్ము చేసుకుంటున్నారని, రోజుల తరబడి వందల కొద్దీ ట్రిప్పులు అవసరమైన వారికి రవాణా చేస్తూ, నగదుగా మార్చుకుంటున్న విషయం బహిరంగ రహస్యమే. రైతులకు సాగు యోగ్యం కోసం ఇచ్చిన సడలింపును ఆసరా చేసుకొని, అక్రమంగా మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా మట్టిని తరలించి, లక్షలు గడిస్తున్నారు. ఆపాల్సిన ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం చోద్యం చూస్తున్నారు.

*కాసులు కురిపిస్తున్న చెరువు మట్టి*

జిల్లాలోని నెన్నెల మండలం అవడం చెరువులో జరుగుతున్న మట్టి తవ్వకాలపై ఇప్పటికే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరి ప్రయోజనం కోసం చెరువు మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారనే చర్చ  గ్రామంలో జోరుగా సాగుతోంది. చెరువు పూడికతీత పేరుతో తవ్వుతున్న మట్టిని భారీ స్థాయిలో జిల్లాలోని మందమర్రి ప్రాంతంలోని ఇటుక బట్టీ లకు తరలిస్తున్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ వ్యవహారం వెనుక ఆర్థిక ప్రయోజనాలు భారీగా ఉన్నాయా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. గ్రామస్థుల కథనం ప్రకారం, చెరువు వద్ద రోజూ పదుల సంఖ్యలో లారీలు తిరుగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు మట్టి లోడింగ్, రవాణా కొనసాగుతుండటంతో ఇది సాధారణ పూడికతీత పనులను మించి సాగుతోందని స్థానికులు పేర్కొంటున్నారు. ఒకవైపు చెరువు అభివృద్ధి పేరుతో పనులు జరుగుతున్నాయని చెబుతుండగా, మరోవైపు అదే మట్టి వాణిజ్య అవసరాలకు వినియోగమవుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం చెరువుల నుండి తీసిన పూడికతీత సారవంతమైన మట్టిని సమీప రైతులకు ఉచితంగా సరఫరా చేయాల్సి ఉంటుంది. ఈ  మట్టి తవ్వకాల్లో ఎంత పరిమాణంలో పూడిక తీసి, మట్టిని తరలిస్తున్నారు, దాని విలువ ఎంత, ఎవరికి అనుమతి ఇచ్చారు, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తోంది, లేక ప్రైవేటు వ్యక్తులకే ప్రయోజనం చేకూరుతోందా వంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రామసభ తీర్మానం లేకుండా, స్థానిక ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వకుండా పనులు చేపట్టడం పలు అనుమానాలకు తావిస్తోందని గ్రామస్తులు చెబుతున్నారు. ఇటుక బట్టీలకు చెరువు మట్టికి డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ఈ మట్టి వ్యాపారం లక్షల్లో సాగుతుందనే చర్చ సైతం స్థానికంగా జరుగుతోంది. ప్రజా అవసరాల కోసం ఉన్న చెరువులు కొందరికి ఆదాయ వనరులుగా మారుతున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ, భూమాతకు క్షోభను మిగిలిస్తున్నారు. పట్టించు కోవలసిన రెవెన్యూ, ఇరిగేషన్, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు మాముళ్ల మత్తులో మాత్రం చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. పల్లెకు గుండెకాయ వంటి చెరువును కాపాడవలసిన ప్రభుత్వ అధికారులు జిల్లాలో యదేచ్చగా జోరుగా అక్రమ మట్టి దందా జరుగుతున్నప్పటికీ జిల్లా యంత్రాంగం “మామూళ్లు”గా మత్తులో చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ఈ అక్రమ తవ్వకాలపై పలువురు సంబందిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు సమాచారమిచ్చిన స్థానిక కిందిస్థాయి సిబ్బంది సహకారంతో కొద్దిసేపు పనులు నిలిపివేసి, మరల యదేచ్చగా మట్టి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు. పై అధికారులను సైతం మభ్య పెట్టెలా కిందిస్థాయి సిబ్బంది వ్యవహరించే తీరుతో ప్రభుత్వ యంత్రాంగంపై ప్రజల్లో ఉన్న నమ్మకం సడలంతో పాటు ప్రభుత్వ యంత్రాంగం పట్ల అక్రమ మట్టి రవాణా చేస్తున్నవారు సైతం అలుసుగా తీసుకొని, ప్రభుత్వ యంత్రాంగాన్ని కించపరిచేలా మాట్లాడడం కొసమెరుపు. కొన్ని సందర్భాల్లో కొంతమంది అధికారులు భూమి చదును చేస్తున్నారని, వారి పట్టా భూమిలో వారు తవ్వుకుంటున్నారు, మీకెందుకని చెప్పి, తప్పించుకోవడం పరిపాటిగా మారిందని పలువురు ఆరోపిస్తున్నారు. కొంతమంది అధికారులకు అన్ని తెలిసిన పట్టించుకోకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. భూమి చదును కోసం మట్టిని అమ్ముకోవడం, వెంచర్లకు, ఫాంహౌస్లకు, ఇటుక బట్టులకు మట్టిని తరలించడం ఏంటని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా యథేచ్చగా మట్టి తవ్వకాలు జరుపుతున్న ఎవరు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం రైతులు తమ భూములను సాగులోకి తీసుకొచ్చేందుకు ఎత్తయిన గుట్టలు, కొండలు, ఎగుడు, దిగుడు నేలలను సమం చేసుకునేందుకు గనుల శాఖ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తవ్వకం సైతం నిబంధనల మేరకు నిర్ణీత లోతు మాత్రమే తవ్వాలి. భారీ కందకాలు తవ్వరాదు. కానీ ఇవేమీ మట్టిని అక్రమంగా తరలించే వారు పాటించడం లేదు. మట్టి మాఫియా సెలవు రోజుల్లోనే రెచ్చి పోతున్నారు. సెలవు రోజు కావడం అధికార యంత్రాంగం  ఉండకపోవడంతో పట్టపగలే మట్టి తవ్వకాలను చేపడుతున్నారు. సెలవు రోజైతే ఎవరూ ఉండరని, అందుకే అదేరోజు మట్టి తవ్వకాలు జరపాలని సంబందిత కొంతమంది అధికారులు చెబుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. దాదాపు జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. జిల్లాలో చాలా ప్రాంతాల్లో యథేచ్చగా అక్రమ తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్ లో మట్టిని పరిమితికి మించి నింపడంతో రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఎక్కువ కాలం నిలవాల్సిన రోడ్లు ఇలాంటి పనుల వల్ల త్వరగా పాడవుతున్నాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో వాహనదారులు, పంటలు సమయంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. ప్రభుత్వం రోడ్లు మరమత్తులు చేయడానికి అధికంగా ప్రజల సొమ్మును ఖర్చు చేయాలసివస్తుంది. కొందరి అక్రమార్కుల స్వార్థం కోసం ప్రజా ప్రయోజనాలను గాలికి వదిలేయడం మంచిదికాదని, ప్రకృతి పరంగా ఏర్పడిన మట్టిని తవ్వి అమ్మకాలు చేయడంతో పర్యావరణం దారుణంగా దెబ్బతింటుందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికైనా అటూ ఇసుక, ఇటూ మట్టి తవ్వకాలపై ఉన్నతాధికారులు స్పందించి, రెచ్చిపోతున్న ఇసుక, మట్టి మాఫియాపై ఉక్కుపాదం మోపి, పర్యావరణాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు.ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి, మట్టి తవ్వకాలపై సమగ్ర విచారణ చేపట్టి పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా చెరువు మట్టి పేరిట ఎవరైనా అక్రమ లాభాలు పొందుతున్నట్లు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular